తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోల్ గేమ్ మొదలుపెట్టడం అనే రాజకీయ ఆనవాయితీకి బ్రేక్ వేసి ఓ రెండు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం కేసీఆర్ రాజకీయ వ్యూహానికి నిదర్శనం. అలాంటి కేసీఆర్‌కు ఓ 2 విషయాలు తలనొప్పిగా మారాయని అంటున్నారు. ఈ విషయంలో తన మేనల్లుడు, బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అయిన మంత్రి హరీశ్ రావుతో కలిసి తేల్చుకోవాలని గులాబీ దళపతి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అభ్యర్థులను ప్రకటించేయడం ద్వారా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బరిలో దిగిపోయిన గులాబీ దళపతికి ఓ వైపు ఢిల్లీలో, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు కారణంగా మారాయని అంటున్నారు. కేంద్రం చర్చల్లో ఉంచి వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశం ఒకటి కాగా, మరో అంశం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న తెలగాణ విమోచన/ విలీన/ విద్రోహ దినం నిర్వహణ. నిజాం పాలన నుంచి విముక్తి లభించిన ‘సెప్టెంబర్ 17’ను పురస్కరించుకుని నిర్వహించే ఈ కార్యక్రమాలపై కేసీఆర్ సర్కార్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. మిగతా పార్టీలకు తమ వైఖరిపై ఓ స్పష్టత , షెడ్యూల్ ఉండటంతో కేసీఆర్ సర్కారు డైలామాలో పడిపోయింది.
తెలంగాణ గడ్డకు నిజాం పాలనను నుంచి స్వేచ్ఛ దక్కిన సెప్టెంబర్ 17ను ఈ భూమి పుత్రులు ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఈ రోజుకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ వ్యూహాలను ప్రకటించాయి. రెండు జాతీయ పార్టీలు పరేడ్ గ్రౌండ్ను వేదికగా చేసుకుంటున్నట్లు ప్రకటించగా బీజేపీకి అనుమతి దక్కింది. గత ఏడాదిలాగే పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు చేసేందుకు బీజేపీ సర్వం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మరోచోట నిర్వహించేందుకు ఎదురుచూస్తోంది. రాష్ట్రానికి స్వాతంత్ర్య దినోత్సవంగా వేడుకలు జరుపుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇలా రెండు పార్టీలు వేగంగా ఏర్పాట్లు చేసుకుంటుండగా, అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఈ ఎపిసోడ్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం, సెప్టెంబర్ 17ను ఏ విధంగా నిర్వహించాలనే విషయంలో కేసీఆర్ సర్కారు ఎప్పుడూ డైలమాలోనే ఉండటం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2022లో తప్ప రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ఉత్సవాలను అధికారికంగా నిర్వహించలేదు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది. అప్పుడు దీనికి పోటీగా రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యత ఉత్సవాలను జరిపింది. ఏకంగా మూడు రోజుల పాటు ‘జాతీయ సమైక్యత’ పేరుతో జిల్లాలు, నియోజకవర్గాల్లో ‘సెప్టెంబర్ 17’ కార్యక్రమాలు నిర్వహించింది.
అయితే, ప్రస్తుతం వారం గడువు కూడా లేనప్పటికీ ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ విషయంలో ఎట్ల ముందుకు వెళ్లాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న గులాబీ దళపతి తన మేనల్లుడు, పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుతో రెండ్రోజులుగా ప్రగతిభవన్లో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిజాం నుంచి విముక్తి అనే కోణంలో వేడుకలు జరిపితే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి బదులుగా మరే రూపంలో ఈ కార్యక్రమం చేపట్టవచ్చో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా కేంద్రం అడుగులు వేస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలోనూ హరీశ్ రావుతో కలిసి తేల్చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.