అప్పుడు జగన్కు.. మరి ఇప్పుడు బాబుకు?

స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరిట స్కామ్ జరిగిందనే ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. బాబునే ఏ1 నిందితుడిగా చేర్చింది. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు ముందు బాబు అరెస్టు, అరెస్టు చేసిన విధానం ఆయన రాజకీయ మైలేజీని పెంచుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయంగా బాబుకు మేలు చేస్తుందనే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న బాబుకు.. ఈ అరెస్టు లాభం చేకూర్చే ఆస్కారముందనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా వైఎస్ జగన్ అరెస్టు విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.

జగన్ రాజకీయ జీవితం కీలక మలుపు తీసుకోవడానికి, వేగం అందుకోవడానికి ఆయన అరెస్టు కారణమనే అభిప్రాయాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. 2011లో వైసీపీ పార్టీని స్థాపించిన జగన్.. 2012 మేలో అరెస్టయ్యారు. అక్రమాస్తుల ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం విదితమే. 16 నెలల పాటు చంచల్ గూడ జైలులో జగన్ గడిపారు. చివరకు 2013 సెప్టెంబర్ లో బెయిల్పై బయటకు వచ్చారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత జగన్ జోరు మొదలైందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో గెలిచింది. ఇదే ఊపులో ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసిన జగన్.. 2019 ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాల్లో పార్టీని గెలిపించి సీఎం అయ్యారు.

ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ అలాగే జరిగే సూచనలు కనిపిస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అరెస్టును వాడుకుని బాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన పరిస్థితులు ఏర్పడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ ధాటిని ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం అంత సులువేం కాదు. కానీ విజయం కోసం బాబు ఇప్పటికే తీవ్రంగా కసరత్తుల్లో మునిగిపోయారు. ఇప్పుడు ఈ అరెస్టు విషయం బాబుకు, పార్టీకి ప్రజల్లో మైలేజీ తీసుకొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పర్యటనలో ఉన్న సమయంలో ప్రజలు, కార్యకర్తల మధ్య వచ్చి అరెస్టు చేయడం బాబు ఇమేజ్ ను మరింత పెంచే ఆస్కారముందని అంటున్నారు.