అల్లుడి కోసం రంగంలోకి మల్లారెడ్డి

డైలాగ్ లతో, తన హావభావాలతో ప్రజల్లో ఫేమస్ అయిన మంత్రి మల్లారెడ్డి ఇప్పుడిక తన అల్లుడి రాజకీయ భవిష్యత్ పై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అల్లుడు రాజశేఖర్ రెడ్డిని మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు మల్లారెడ్డి రంగంలోకి దిగారు. మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరడం ఖాయమవడంతో.. ఇప్పుడా స్థానంపై మల్లారెడ్డి కన్ను పడింది. అల్లుడు రాజశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తాజాగా మల్లారెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబానికి మినహాయించి.. ఇతర నాయకుల కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చే అవకాశమే లేదని చెప్పాలి. అందుకే తన కొడుకు రోహిత్కు మెదక్ టికెట్ ఇవ్వాలంటూ మైనంపల్లి హన్మంతరావు పట్టుబట్టిన కేసీఆర్ పట్టించుకోలేదు. మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్ ఇచ్చి.. మెదక్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్కే మరోసారి అవకాశం కల్పించారు. దీంతో తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం మైనంపల్లి హస్తం గూటికి చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న మల్కాజిగిరి నియోజకవర్గంపై బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. వీళ్లలో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు రేసులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి.. మల్కాజిగిరి నుంచి ఎలాగైనా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని బరిలో దింపేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా మల్లారెడ్డి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటి చేసిన రాజశేఖర్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇప్పుడు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో అల్లుడిని నిలబెట్టి, గెలిపించుకుని, అసెంబ్లీకి తీసుకెళ్లాలని మల్లారెడ్డి చూస్తున్నారు. అయితే మల్లారెడ్డి వినతిపై స్పందించిన కేటీఆర్. . తొందరేముంది, చూద్దాం అని సమాధానమిచ్చినట్లు తెలిసింది.