కమ్యూనిస్టులకు దిక్కుతోచటం లేదా ?

తెలంగాణాలో కమ్యూనిస్టులకు దిక్కుతోస్తున్నట్లు లేదు. అందుకనే ఏవేవో మాట్లాడుతున్నారు. తమ వాస్తవ బలానికి మించిన మాటలు చాలా చెబుతున్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. కూనంనేని ఏమన్నారంటే తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని. అంటే కమ్యూనిస్టుల ఆలోచనలలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే కమ్యూనిస్టులతో కలిసొచ్చే పార్టీలంటూ ప్రత్యేకించి ఏమీలేవు.

బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు తీసుకుని గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని కమ్యూనిస్టులు చాలా కలలు కన్నారు. అయితే ఆ కలలను కేసీయార్ అడ్డంగా తుంచేశారు. ఏకపక్షంగా బీఆర్ఎస్ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించేయటంతో కమ్యూనిస్టులకు పెద్ద షాక్ తగిలింది. తర్వాత కాంగ్రెస్ తో పొత్తుకు ప్రయత్నించారు. అయితే ఇక్కడ కూడా పెద్దగా సానుకూల సంకేతాలు అందటం లేదు. కాంగ్రెస్ తో పొత్తు కూడా వర్కవుటవుతుందనే అనుమానాలను కమ్యూనిస్టులు వదులేసుకున్నట్లున్నారు.

అందుకనే కూనంనేని మాట్లాడుతూ తాము ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం కాదని తమతో పొత్తులు పెట్టుకునే పార్టీలతో కలిసి నడుస్తామన్నారు. పట్టుమని పది సీట్లలో కూడా గట్టి అభ్యర్థులను పోటీకి దింపలేని కమ్యూనిస్టులతో ఎవరు పొత్తులు పెట్టుకుంటారు ? ఇంతకాలం కమ్యూనిస్టు పార్టీలే కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీల మీద ఆధారపడి బతికాయి. అలాంటిది ఇపుడు బీఆర్ఎస్ కాదు పొమ్మన్నది. కాంగ్రెస్ ఇంకా ఆ విషయాన్ని చెప్పలేదు. అయితే కమ్యూనిస్టలకు ఏదో అనుమానం పెరిగిపోతున్నట్లుంది.

అందుకనే ఇక లాభం లేదని తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్లున్నారు. అయితే సీపీఐ, సీపీఎం పార్టీలకే ఒకదానిపై మరొకదానికి నమ్మకం ఉండదు. అలాంటిది రెండు పార్టీలు కలిసి ఇతర పార్టీలను పొత్తులకు ఆహ్వానించటమే పెద్ద జోక్ అయిపోయింది. వ్యవహారం చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులకు ఒక్కసీటు కూడా దక్కేట్లు లేదు. ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు రావటం లేదు. పొత్తులో పోటీ చేయాలంటే పెద్ద పార్టీలు పట్టించుకోవటంలేదు. గెలుపుకు అవసరమైన ఓట్లు కమ్యూనిస్టులకు లేవన్నది వాస్తవం. కాకపోతే ఇతరుల ఓటమికి సరిపడా ఓట్లు మాత్రం కమ్యూనిస్టులకు ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.