దేశం కావొచ్చు.. రాష్ట్రం కావొచ్చు.. రాజధాని ఒకటే ఉంటుంది. ఒకటికి మించి ఎక్కువ రాజధానులు ఉంటే.. అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయన్న వాదన ఇటీవల జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వాదనలకు తమిళనాడు రాష్ట్ర అధికారపక్ష నేతలు స్ఫూర్తి పొందారేమో కానీ.. ఈ మధ్యన తమిళనాడు రెండు.. మూడు రాష్ట్ర రాజధానుల ఏర్పాటుపై కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొస్తున్నారు.
అధికార అన్నాడీఎంకేకు చెందిన నేతలు రెండో రాజధానిగా మధురైను.. మూడో రాజధానిగా తిరుచ్చిని ప్రకటిస్తే బాగుంటుందన్న వాదనను వినిపిస్తున్నాయి. మొన్నటివరకు ఒకరిద్దరు నేతలు ప్రస్తావించే ఈ అంశాన్ని.. ఇటీవల పలువురునేతలు వరుస పెట్టి వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆగ్రహానికి గురయ్యారు. రెండు.. మూడు రాజధానుల వ్యవహారం ఏమీ లేదని స్పష్టం చేశారు.
మధురైను రెండో రాజధానిగా ప్రకటిస్తే.. ఆర్థికంగా.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్న వాదనలో పస లేదని తేల్చేశారు. రెండో రాజధాని ప్రతిపాదనే లేదని.. అలాంటప్పుడు మూడో రాజధాని మాటే రాదన్నఆయన.. కొంతమంది మంత్రుల వ్యక్తిగత అభిప్రాయాలేనని స్పష్టం చేశారు. రెండో రాజధాని ఆలోచనే ప్రభుత్వానికి లేదన్నారు. అంతేకాదు.. అనవసరమైన డిమాండ్లను తెర మీదకు తెస్తున్న మంత్రులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధురైను రెండో రాజధానిగా ప్రకటించాలని రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్ తెర మీదకు తెచ్చారు. దీనికి మరో మంత్రి నటరాజన్ మరో అడుగు ముందుకువేసి.. తిరుచ్చిని కూడా రాజధాని నగరంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే నేతల వాదనలు ఇలా ఉంటే.. వీరి మాటలకు కాంగ్రెస్ ఎంపీ తిరునావుక్కరసు కూడా మద్దతు ఇవ్వటంతో పళని అలెర్టు అయ్యారు.
ఇలాంటి వాదాలు రగలనంతవరకు బాగానే ఉంటాయని.. ఒక్కసారి ప్రజల మనసుల్లోకి వెళ్లాక ఇబ్బందులు తలెత్తుతాయన్న విషయాన్ని గుర్తించిన సీఎం పళిని కాస్త కటువుగానే స్పందిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు దగ్గరవుతున్న వేళలో.. ఇలాంటి వాదనలు తెర మీదకు రావటం అన్నాడీఎంకే అధినాయకత్వానికి కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. అందుకే.. మొగ్గలో ఉన్నప్పుడే లెక్క తేల్చేస్తే సరిపోతుందన్న భావనలో అధికార పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates