శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో పేలుళ్లు.. చిక్కుకునన సిబ్బంది

తరచూ ఏదో విపత్తు చోటు చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఎప్పుడు వినని రీతిలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ టన్నెల్ లో ప్రమాదం చోటు చేసుకునే సమయానికి ఇరవై మంది వరకు సిబ్బంది పని చేస్తున్నట్లు తెలుుస్తోంది.

రాత్రి విధుల్లో సిబ్బంది తమ పని తాము చేసుకుంటున్న వేళ.. నాలుగో యూనిట్ టర్మినల్ వద్ద కార్మికులు విద్యుదుత్పత్తి పనిలో నిమగ్నమై ఉన్నారు. అనుకోని రీతిలో పెద్ద శబ్దంతో పాటు.. ఆకస్మాత్తుగా షార్ట్ సర్య్కూట్ తో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగిన వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించి పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దాలు వెలువడ్డాయి.

రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్ నుంచి సర్వీస్ బే వరకు దట్టమైన పొగ కమ్ముకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో దాదాపు 25 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే.. సిబ్బంది పలువురు బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తుంది. వీరిలో కొందరు గాయపడగా.. మరికొందరు మాత్రం అందులోనే చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది.

బయటపడిన వారిని వెనువెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు ఆరుగురు మంటల్లో చిక్కుకుపోయినట్లుగా సమాచారం. సొరంగంలో దట్టమైన పొగలు వెలువడుతుండటంతో సహాయ కార్రయక్రమాలకు ఆటంకం కలుగుతున్నట్లుగా చెబుతున్నారు. మంటల్ని ఆర్పే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే.. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు తొమ్మిది మంది మంటల వద్ద చిక్కుకుపోయి.. బయటకు రాలేని పరిస్థితుత్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పోలీసులు.. రక్షణ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి.. వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డిలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యుట్ కారణంగా ఈ భారీ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నా.. నిత్యం సురక్షిత చర్యలు పెద్ద ఎత్తున తీసుకునే చోట ఇలాంటి ఘోరం చోటు చేసుకోవటం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.