బీజేపీకి టెన్షన్ మొదలైందా?

ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి నేతలను చేర్చుకోవడం దేవుడెరుగు ఉన్నవాళ్ళని కాపాడుకోవమే చాలా కష్టంగా తయారవబోతోందని సమాచారం. సెప్టెంబర్ రెండో వారం నుండి బీజేపీలోని నేతలే కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం మొదలైంది. సెప్టెంబర్ 2వ వారం అంటే ప్రత్యేకత ఏమిటంటే కాంగ్రెస్ లో టికెట్లు ఫైనల్ చేయబోతున్నారు. మొదటి లిస్టు సెప్టెంబర్ 1వ వారం తర్వాత బయటకు వస్తుందని అనుకుంటున్నారు.

అందుకనే కాంగ్రెస్ లో చేరి పోటీ చేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు సెప్టెంబర్ 2వ వారంలో చేరాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. కొందరు ఇప్పటికే హస్తం పార్టీ సీనియర్లతో రెగ్యులర్ టచ్ లో ఉన్నారట. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారమే కమలం పార్టీ కొంప ముంచేస్తోందని సమాచారం. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం తెలంగాణా బీజేపీ మీద బలంగా పడినట్లు అర్ధమవుతోంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించటంతో తెలంగాణాపై బీజేపీ అగ్రనేతల వ్యూహాలన్నీ ఒక్కసారిగా దెబ్బతినేశాయి.

ఒకప్పుడు అంటే దాదాపు మూడు నెలల క్రితం బీజేపీలో  ఉన్న జోరు ఇపుడు ఎక్కడా కనబడటం లేదు. ఇపుడున్న నేతల్లో చాలామంది మొక్కుబడిగా మాత్రమే ఉంటున్నట్లు అనిపిస్తోంది. ఈమధ్యనే కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన నేతల్లో చాలామంది తిరిగి హస్తంపార్టీ గూటికి చేరటానికి రెడీ అవుతున్నారట. వీలైనంత తొందరగా కాంగ్రెస్ లో చేరి తాము పోటీ చేయాలని అనుకుంటున్న నియోజకవర్గంలో టికెట్ ఖాయం చేసుకోవాలని అనుకుంటున్నారట.

కర్నాటక ఎన్నికల ప్రభావం ఒక ఎత్తయితే బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తప్పించటం మరో సమస్యగా మారిందట. బీసీ సామాజికవర్గానికి చెందిన బండిని అగ్రనేతలు అర్ధాంతరంగా పదవి నుండి తప్పించేశారు. బండి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి పార్టీలో మంచి జోష్ నింపారు. పార్టీని గ్రాస్ రూట్ నుండి పై స్ధాయి దాకా ఏదో ఒక కార్యక్రమం పెట్టి స్పీడుగా నడుపుతున్నారు. ఏదో పద్దతిలో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారని అనుకుంటున్న దశలో సడెన్ గా బండిని మార్చేశారు. దాని ప్రభావం పార్టీలో ఉన్న లేదా చేరాలని అనుకుంటున్న బీసీ నేతలపైన బాగా పడిందట.