రజినీని తిట్టిపోసి.. రజినీ‌తోనే ఎలివేషనా?

కొన్ని నెలల ముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని పొగిడినందుకు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన నాయకులు ఆయన్ని ఎంత తీవ్ర స్థాయిలో విమర్శించారో తెలిసిందే. జగన్‌ను కానీ, ఆయన ప్రభుత్వాన్ని కానీ పల్లెత్తు మాట అనకపోయినా చంద్రబాబును పొగడ్డమే రజినీ తప్పయిపోయింది.

కొడాలి నాని, రోజా సహా చాలామంది వైసీపీ అగ్ర నేతలే రజినీని టార్గెట్ చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రజినీ జీరో అయిపోయాడని వ్యాఖ్యానించారు. కట్ చేస్తే.. ఇటీవలే ‘జైలర్’ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు సూపర్ స్టార్. యావరేజ్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఆయన సాగించిన విధ్వంసం చూసి అందరూ షాకయ్యారు. ‘జైలర్’ ఏపీలో భారీ వసూళ్లు సాధించడం వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది.

ఐతే రజినీని అప్పుడు అంతగా విమర్శించిన వాళ్లే.. ఇప్పుడు ఆయన సినిమా డైలాగులు, పాటలు వాడుకుంటుండటం విశేషం. హుకుం పాటను జగన్‌కు అన్వయిస్తూ ఇప్పటికే వైసీపీ వాళ్లు రీల్స్, షార్ట్స్ చేశారు. వాటిని వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ వాడుకుని జగన్‌కు ఎలివేషన్‌కు ఇవ్వాలని చూశాయి.

ఐతే ఇప్పుడు ఏకంగా రోజా నిన్న చిత్తూరు జిల్లాలో జరిగిన సీఎం పర్యటన సందర్భంగా ‘జైలర్’ ఆడియో వేడుకలో రజినీ చెప్పి.. ‘‘మొరగని కుక్క లేదు..’ డైలాగ్‌ను జగన్‌ ఎలివేషన్ కోసం ఉపయోగించుకుంది. రజినీ స్టయిల్లో ‘అర్థమైందా రాజా’ అనే డైలాగ్‌ను కూడా పేల్చింది రోజా. ఐతే కొన్ని నెలల ముందు రజినీని అంతగా తిట్టిన నోటితో ఇప్పుడు ఆయన డైలాగులతో జగన్‌‌కు ఎలివేషన్‌ ఇవ్వాలని చూడటం వైసీపీ నేతలకే చెల్లిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి.