బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేదు. ఆయన ఎంత చెబితే అంతా. నచ్చితే ఏ నాయకుడినైనా తలమీద ఎక్కించుకుంటారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేస్తారు. రెండో అవకాశం ఇవ్వడం, బెదిరింపులకు లొంగడం కేసీఆర్ కు తెలియదనే చెప్పాలి. అలాంటిది తాజాగా కేసీఆర్ కే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేనే డెడ్ లైన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో విజయంతో మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకేసారి, అన్ని పార్టీల కంటే ముందుగానే 115 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించేశారు. 7 చోట్ల సిట్టింగ్లకు మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ పై అసంత్రుప్తి వ్యక్తమవుతోంది. తాజాగా టికెట్ దక్కని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తానేమీ అక్రమాలు చేయలేదని, అన్యాయం చేయలేదని, ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు అమ్ముకున్నానని సుభాష్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడినైనా తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్లానని, 23 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న తనకు కాదని ఏ సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం జీర్ణించుకోలేకపోతున్నట్లు సుభాష్ చెప్పారు.
అంతే కాకుండా వారం రోజుల్లో టికెట్ పై కేసీఆర్ పునరాలోచన చేయకుంటే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని డెడ్ లైన్ విధించడం గమనార్హం. ఈ సారి సుభాష్ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన బండారు లక్ష్మారెడ్డికి ఉప్పల్ టికెట్ను కేసీఆర్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న సుభాష్ ను కేసీఆర్ ఎలా దారికి తెచ్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.