ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడిగకత్తితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన శ్రీనివాసరావు దాదాపుగా ఐదేళ్లుగా బెయిల్ కూడా లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక, ఈ కేసులో విచారణకు రావాలని సీఎం జగన్ ను విజయవాడలోని ఎన్ ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య ఈ కేసు విశాఖకు బదిలీ అయింది.
ఈ నేపథ్యంలోనే ఈ కేసులో జగన్ ఎన్వోసీ ఇవ్వాలని కోరుతూ దళిత సంఘాలు విశాఖలో నిరసన చేపట్టేందుకు కొద్దిరోజులు క్రితం ప్రయత్నించాయి. కానీ ఆ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు మొదలు కాకముందే భగ్నం చేశారు. నిరసన చేపట్టడానికి ముందే వారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు కోడి కత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు అని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. శ్రీనివాస్ కు కోడి కత్తిని అందించింది బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అని నిందితుడు శ్రీనివాసరావు న్యాయవాది సలీం ఆరోపణలు చేశారు. ఈ కేసులో విచారణకు జగన్ హాజరు కావడం లేదని, ఆయన హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని, కేవలం రాజకీయ కోణం మాత్రమే ఉందని సలీం ఆరోపించారు. ఈ విషయాన్ని గతంలోనే ఎన్ ఐఏ చెప్పిందని సలీం గుర్తు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates