తెలంగాణాలో కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే అభ్యర్ధుల మొదటి లిస్టు రెడీ అవుతున్నట్లే ఉంది. సెప్టెంబర్ మొదటివారంలో జాబితా రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మొదటిజాబితాలో 40 మంది అభ్యర్ధులు ఉంటారని సమాచారం. మొదటిజాబితాలో సిట్టింగ్ ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధుల్లో కొందరి పేర్లుంటాయనట. మిగిలిన అభ్యర్ధుల పేర్లు రెండు, మూడో జాబితాలో ఉంటాయట. అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గాలను మూడోజాబితాలో చేర్చారట.
గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటి మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చిన దరఖాస్తులు, ఏ నియోజకవర్గాలకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అందులో అప్లైచేసిన వాళ్ళ వివరాలు తదితరాలపై చర్చించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక అంశాలపై వాడివేడి చర్చలు జరిగాయి. వచ్చిన దరఖాస్తులపై కమిటి ప్రాధమికంగా చర్చలు జరిపి ఒక కొలిక్కి తీసుకొస్తే తర్వాత ఫైనల్ చేసేటపుడు ఈజీగా ఉంటుందని కమిటి నిర్ణయించింది.
రెండో దశలో కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణా ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే కూడా హాజరవుతారని సమాచారం. వచ్చిన దరఖాస్తుల్లో నియోజకవర్గానికి ఏకైక పేరుతో దాఖలైన దరఖాస్తులపై చర్చ జరిగినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. అంటే సింగిల్ నేమ్ పై కమిటి స్ర్రీనింగ్ చేసిందని అర్ధమవుతోంది. అయితే ఏమి నిర్ణయం తీసుకున్నదో మాత్రం వివరాలు బయటకు తెలీటంలేదు.
కమిటిలోని నేతల ఏకాభిప్రాయంతో సుమారు 25 నియోజకవర్గాలను ఖరారు చేసే అవకాశాలున్నాయట. అలాగే రెండు, మూడు దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో కూడా ఏకాభిప్రాయంతో ఖరారు అయ్యే నియోజకవర్గాలు 30 దాకా ఉండచ్చని కమిటి అభిప్రాయపడిందట. ఏదేమైనా వచ్చిన దరఖాస్తులు, స్క్రూటినిని గమనిస్తే అభ్యర్ధుల ఎంపిక అంత తేలికగా జరగదని అర్ధమైపోతోంది. గాంధీభవన్లోనే పెద్ద యుద్ధం జరిగేట్లుంది. దీని తర్వాత టికెట్లు దక్కని సీనియర్లలో కొందరు ఎలాగూ ఢిల్లీకి వెళ్ళే అవకాశాలున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates