ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క రాష్ట్రంలో కరోనా కట్టడికి నియంత్రణ చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కార్…మరో పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ….గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు సీఎం జగన్.
ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో జగన్ నేతృత్వంలోని మంత్రి వర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ముగిసిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020 నుంచి 2023 వరకు కొనసాగేలా నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సెప్టెంబరు 5వ తేదీ నుంచి జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్‌లు, షూ, బెల్టు తదితర వస్తువులను 43 లక్షలకు పైగా విద్యార్థులకు అందజేయనున్నారు. రాబోయే నాలుగేళ్లలో డ్వాక్రా మహిళలకు రూ.27 వేల కోట్లకు పైగా లబ్ది చేకూర్చే వైఎస్సార్ ఆసరాపథకానికి జగన్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించడంతోపాటు, వైఎస్ఆర్ భీమా పథకానికి ఆమోదం తెలిపింది.
సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.పంచాయితీరాజ్ శాఖలో 51 డివిజినల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కడప జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతానికి, రాయచోటిలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీ ఫెడరేషన్లు, రామనపాడు పోర్టు డీపీఆర్‌కు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నంలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై కూడా కేబినెట్ చర్చించింది. రాజధాని భూముల కుంభకోణం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం, పాలనా వికేంద్రీకరణ బిల్లు, ఇళ్ల పట్టాల పంపిణీ, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates