టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి నారా చంద్రబాబునాయుడు, తల్లి నారా భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రను లోకేష్ మొదలుబెట్టారు. ఆ సమయంలో నారా భువనేశ్వరి..లోకేష్ పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆశీర్వదించి పంపించారు. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో భువనేశ్వరి కూడా ఒకరోజు పాల్గొన్నారు. అయితే ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడలేదు. కానీ, తాజాగా కుప్పంలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి…లోకేష్ పాదయాత్రపై స్పందించారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. లోకేష్ పాదయాత్ర చేయాలని సంకల్పించిన సమయంలో తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని భువనేశ్వరి అన్నారు. తన తనయుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్న తరుణంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆమె వెల్లడించారు. అయితే, పాదయాత్ర చేస్తున్న కొద్దీ లోకేష్ రాటుదేలాడని, అది తనకు సంతోషాన్నిచ్చిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కోసం, ప్రజల కోసం తమ కుటుంబం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుందని భువనేశ్వరి ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి ఎన్టీఆర్ పేరిట రూ.100 స్మారక నాణఎం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. నాణెం విడుదలకు కృషిచేసిన అక్క పురందేశ్వరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ సంజీవిని ఉచిత వైద్యశాలను ప్రారంభించిన భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.