దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకు 60వేలకు పైగా కేసులు నమోదవుతుండగా….ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఏపీలో రోజుకు 7 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా….తెలంగాణలో దాదాపు 1500కు పైగానే కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో టెస్టులు, కేసుల సంఖ్యపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా..తెలంగాణాలో టెస్టులు, కేసుల సంఖ్య తక్కువగా చూపుతున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలలో దాదాపు 50 శాతం మందికి కరోనా సోకి వెళ్లిపోయిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
తెలంగాణలోని విపక్షాల ఆరోపణలకు తగ్గట్లుగానే హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెంట్రల్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ), ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) సంస్థలు సంచలన విషయాలను వెల్లడించాయి. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ చెబుతున్న దానికంటే భారీ స్థాయిలో కరోనా వ్యాప్తి చెందిందని బాంబు పేల్చాయి.
అంతేకాదు, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 6.6 లక్షల మందికి కరోనా సోకిందని మురుగు నీటి నమూనాలపై జరిపిన పరిశోధనల ఆధారంగా అంచనా వేశాయి. నగరంలోని అన్ని చోట్లా కరోనా వ్యాప్తి సమానంగానే ఉందన్న ఆ సంస్థలు…చాలామంది కరోనా బారినపడి…గత 35 రోజుల్లో మళ్లీ సాధారణ స్థితికి వచ్చి ఉంటారని వెల్లడించాయి.
తుమ్ములు, దగ్గు ద్వారా వచ్చే తుంపర్లతో పాటు మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బయటకొస్తోందని, అందుకే మురుగునీటి పరీక్షల అంశంపై పరిశోధన చేపట్టామని ఐఐసీటీ, సీసీఎంబీలు వెల్లడించాయి. కరోనా బాధితులు కోలుకున్న తర్వాత కూడా సుమారు 35 రోజుల వరకు వైరస్‌కు సంబంధించిన పదార్థాలు విడుదలవుతాయని తెలిపాయి.
కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి వైరస్ ను నిర్ధారించి తగు చర్యలు తీసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని తెలిపాయి. మురుగునీటిలో వైరస్ ఆనవాళ్లతో ఆందోళన వద్దని, ఇందులో ఉండే ఆర్ఎన్ఏ ద్వారా కరోనా ఇతరులకు వ్యాపించదని వెల్లడించాయి.
ఇక, ఏపీలోని విజయవాడలో దాదాపు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితే ఉందని సిరో సర్వైలెన్స్ సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. విజయవాడతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 43.81శాతం మంది కరోనా బారిన పడ్డారని తేలింది. బెజవాడలో 40.51 శాతం మందికి కరోనా సోకి…వెళ్లిపోయిందని సిరో సర్వెలైన్స్‌లో సర్వేలో తేలింది.
వారి రక్త నమూనాలను పరీక్షించగా శరీరంలో యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడలో కరోనా సోకిన వారి సంఖ్యను అంచనా వేసేందుకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సిరో సర్వైలెన్స్‌ను నిర్వహించగా ఈ గణాంకాలు వెలుగుచూశాయి. గుడిసెలు, చిన్న ఇళ్లు, అపార్టుమెంట్లు, వైరస్ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఎంపిక చేసిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ రెండు సర్వేలను బట్టి హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో దాదాపు 50 శాతం మంది కరోనా బారినపడి కోలుకున్నారని, వారికి కరోనా సోకినట్లు కూడా తెలీదని చెప్పవచ్చు. ఏది ఏమైనా…ఈ సర్వేల గణాంకాలు చూసిన ఏపీ అధికారులు…మాకు కరోనా రాలేదనుకుంటున్నారా అని తెలంగాణ అధికారులతో అంటున్నారట.దీనినిబట్టి కరోనా వ్యాప్తిలో ఏపీ, తెలంగాణ దొందు దొందే అనిపించక మానదు.