స్మారక నాణెం విడుదల..జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ

ఢిల్లీలో ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. అన్నగారి శత జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరైన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నగారిపై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ గౌరవార్థం ప్రత్యేక నాణెం విడుదల చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని చంద్రబాబు అన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ ను గౌరవించారని చెప్పారు. హద్దులను చెరిపేస్తూ ఎన్టీఆర్ వారసత్వాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఈ ఘట్టం గర్వకారణం అని చంద్రబాబు కొనియాడారు.

ఈ నాణెం విడుదల తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై నడ్డాతో చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు, ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం, దొంగ ఓట్ల చేరిక అంశాలను కూడా నడ్డా దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక, కేంద్ర ఎన్నికల సంఘానికి దొంగ ఓట్ల వ్యవహారంపై చంద్రబాబు నేడు ఢిల్లీలో ఫిర్యాదు చేయబోతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు, ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. తెలుగువాడిగా, తెలుగుదేశంవాడిగా, నందమూరి తారకరామారావు మనవడిగా ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని గర్విస్తున్నానని లోకేష్ చెప్పారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ప్రజా సేవకుడు, తెలుగుజాతిని ఒక్క తాటిపై నడిపించిన మహా నాయకుడు అని ప్రశంసించారు. శకపురుషుడి శతజయంతిని చరిత్రలో నిలిచిపోయేలా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర ప్రభుత్వానికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.