40 లక్షలతో బస్ షెల్టర్..4 రోజుల్లో కూలింది

విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సౌత్ సైడ్ ఒక బస్సు షెల్టర్ కొత్తగా నిర్మించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి ఈ మోడరన్ బస్ షెల్టర్ ను ఐదు రోజుల క్రితమే అట్టహాసంగా ప్రారంభించారు. ఈ మోడరన్ బస్ షెల్టర్ కం బస్ బేకు 40 లక్షల రూపాయలు వెచ్చించారు. అయితే, పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఈ బస్సు షెల్టర్ కుంగిపోయి ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో, నాసిరకం నిర్మాణం చేపట్టిన ప్రభుత్వంపై జనసేనచ సిపిఎం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బస్ షెల్టర్ నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సిపిఎం, జనసేన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

జీవీఎంసీ కార్యాలయం ముందు కట్టిన బస్ షెల్టర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, మిగతా వాటి పరిస్థితి ఏంటని వారు నిలదీస్తున్నారు. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని, ఇలా నాలుగు రోజులకే బస్సు షెల్టర్ కూలిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆ కుంగిపోయిన బస్సు షెల్టర్ ముందు జనసేన, సిపిఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బస్ షెల్టర్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన వారిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పరిపాలనా రాజధాని అని చెబుతోన్న విశాఖలో ఇటువంటి పరిస్థితి ఉంటే ఎలా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.