అక్రమాల్లో పీహెచ్‌డీ చేసిన బాబు: సజ్జల!

ఓట్ల తొలగింపుపై టీడీపీ రాద్దాంతం చేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.గురువారంనాడు ఆయన అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ తీరు దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల దొంగ ఓట్లు ఉన్న విషయం గుర్తించామన్నారు. దీంతో చంద్రబాబులో వణుకు మొదలైందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

అక్రమాలు చేయడంలో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు. దొంగ ఓట్ల బాధితులం తామేనని ఆయన చెప్పారు.టీడీపీకి తెలిసిందల్లా తప్పుడు పనులు చేయడమేనన్నారు.2015-17 కాలంలో 50 లక్షల ఓట్లను తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ గతంలో అన్యాయంగా తొలగించిన ఓట్లను చేర్పించినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ అలవాటు కూడా తమకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఓట్ల తొలగింపులో టీడీపీ చేసిన అక్రమాలపై తాము గతంలో పోరాటం చేసినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. తమ పార్టీ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తుందన్నారు.చంద్రబాబు విద్యలు అందరికీ తెలుసునన్నారు. గోడలు దూకడం, అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటేనన్నారు. గతంలో సేవామిత్ర పేరుతో టీడీపీ నేతలు అక్రమాలు చేశారన్నారు.

దొంగ ఓట్ల విషయమై న్యూఢిల్లీలోని సీఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తుంది. దొంగ ఓట్ల విషయమై అధికార వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం సాగుతుంది. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల అంశానికి సంబంధించి ఇద్దరు అధికారుల సస్పెన్షన్ విషయమై మరోసారి రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రమయ్యాయి.