ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ రాజేంద్ర నాథ్ ను కలిశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతుందని తనకు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..లోకేష్ వల్ల ప్రాణహాని ఉందని నేను డీజీపీని కలిశాను. ఆయన నాకు భద్రత కల్పిస్తామన్నారని ఆయన మీడియాతో తెలిపారు. మొదట నారా లోకేష్ నన్ను టీడీపీలో చేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. నేను టీడీపీలో చేరకపోయే సరికి నా మీద కక్ష కట్టాడు అని పేర్కొన్నారు.
నేను ఏ కార్యక్రమంలో అయినా లోకేష్ గురించి గట్టిగా చెబుతున్నాను కాబట్టే ఆయన నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లోకేష్ గురించి నిజాలు అన్ని బయటపెట్టింది నేనే. అందుకే ఆయన అందరినీ బట్టలిప్పి కొడతా అంటున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది బట్టలూడదీస్తావు అని ఆయన ప్రశ్నించారు.
ఆ యాత్ర..ఈ యాత్ర అంటూ పాదయాత్రలు చేస్తున్న లోకేష్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేనప్పుడు పవన్ ని సీఎంని చేస్తానని ఆయన చెప్పాలని కోరారు. జగన్ అంటే నాకు ప్రాణం.. 13 సంవత్సరాల నుండి ఆయనతోనే ఉన్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates