తుమ్మలపై ఒత్తిడి పెరిగిపోతోందా ?

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మద్దతుదారుల ఒత్తిడి పెరిగిపోతోంది. పాలేరులో పోటీచేసేందుకు బీఆర్ఎస్ లో తలుపులు మూసుకుపోయిన విషయం తెలిసిందే. టికెట్ తనకే వస్తుందని తుమ్మల పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అయితే ఫిరాయింపు ఎంఎల్ఏ కందాళం ఉపేందర్ రెడ్డికే టికెట్ అని కేసీయార్ ప్రకటించారు. దాంతో తుమ్మల ఆశలన్నీ ఆవిరైపోయాయి. దాంతో మద్దతుదారులంతా మండిపోతున్నారు. ఇంతగా అవమానించిన బీఆర్ఎస్ లో ఎందుకు ఉండాలని తుమ్మలను నిలదీస్తున్నారు.

పిలిచి టికెట్ ఇస్తానని చెబుతున్న కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలని ఒత్తిడి పెంచేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరితే పాలేరులో టికెట్ ఇస్తామని హస్తంపార్టీ నేతలు ఎప్పటినుండో తుమ్మలకు ఆహ్వానం పంపుతున్నారు. అయితే మాజీమంత్రే ఎటూ చెప్పకుండా కేసీయార్ మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆశలన్నీ వమ్మయిపోయాయి. అందుకనే మద్దతుదారులు తుమ్మలను కాంగ్రెస్ లో చేరాలని గట్టిగా అడుగుతున్నారు. మంగళవారం మద్దతుదారులంతా ఖమ్మంలో మీటయ్యారు.

నిజానికి ఇపుడు తుమ్మలకు ఉన్న మార్గాలు రెండే రెండు. ఒకటి ఇండిపెండెంటుగా పోటీచేయటం లేదా కాంగ్రెస్ లో చేరి పోటీచేయటం. ఇండిపెండెంటుగా పోటీచేసి గెలవటం అంటే మామూలు విషయంకాదు. అందుకనే ఆ విషయమై తుమ్మల పెద్దగా దృష్టిపెట్టడంలేదు. కాబట్టి ఇక మిగిలింది కాంగ్రెస్ లో చేరి పోటీచేయటమే. నిజంగా తుమ్మల గనుక కాంగ్రెస్ లో చేరి పోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్నది గ్రౌండ్ లెవల్ టాక్.

కాంగ్రెస్ కు పాలేరులో బలమైన ఓటుబ్యాంకుంది. దానికి తుమ్మల వ్యక్తిగత ఇమేజి కూడా తోడై, ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా కలిసొస్తే కాంగ్రెస్ గెలుపు తేలికైపోతుంది. ఈ విషయాలు తుమ్మలకు ప్రత్యేకించి ఎవరు చెప్పక్కర్లేదు. గ్రౌండ్ లెవల్ రియాలిటి ఏమిటన్నది తుమ్మలకు బాగా తెలుసు. పైగా కమిటెడ్ మద్దతుదారులు, క్యాడర్ ఉన్నారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ ఓటుబ్యాంకు తోడయితే సరిపోతుంది గెలుపు చాలా ఈజీ అనే చర్చ కూడా మొదలైపోయింది. మరి తుమ్మల చివరకు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి రెండు రోజుల్లో తీసుకోవాల్సిందే. లేకపోతే అదికూడా చేజారిపోయే అవకాశముంది.