సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ చేసిన సందర్భంగా ఈయన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అత్యంత నిజాయితీపరుడిగా, సమర్థవంతమైన అధికారిగా వివి లక్ష్మీనారాయణకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే, స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకునేందుకు దాదాపుగా ఏపీలోని అన్ని పార్టీలు ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలలో విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత పార్టీ విధానాలను నచ్చక జనసేనను వీడిన లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారు అన్నదానిపై చాలాకాలంగా ఉత్కంఠ ఏర్పడింది. కొద్ది నెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరరబోతున్నారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయన ఫలానా పార్టీలో చేరబోతున్నారు అంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లపై లక్ష్మీనారాయణ స్పందించారు.
రాబోయే ఎన్నికలలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. అయితే, తాను ఏ స్థానం నుంచి పోటీ చేస్తాను అన్న విషయంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే, గత ఎన్నికలలో విశాఖ నుంచి ఓటమి పాలైనప్పటికీ అక్కడి ప్రజలు తనను అభిమానిస్తున్నారని చెప్పారు. ఈసారి పోటీ చేస్తే తప్పక గెలిపించుకుంటామని విశాఖవాసులు చాలామంది తనతో అన్నారని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
దాదాపుగా ఆయన రాజకీయాలు విశాఖ నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కూడా లక్ష్మీనారాయణ గతంలో నిరసన గళం వినిపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆఖరికి కేఏ పాల్ వంటి నేతలను కలిసేందుకు సైతం లక్ష్మీనారాయణ వెనుకాడలేదు. ఇక క్రౌడ్ ఫండింగ్ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేందుకు బిడ్ కూడా దాఖలు చేశారు లక్ష్మీనారాయణ. ఈ నేపథ్యంలో విశాఖ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.