వైఎస్సార్ జిల్లా కమలాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో జగన్ బావమరిది పోటీ చేయబోతున్నారా? ఈ మేరకు జగన్ హామీ ఇచ్చారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమలాపురం ఎమ్మెల్యేగా జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. వరుసగా రెండో సారి ఎన్నికల్లో గెలిచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన తనయుడు నరేన్ రామాంజనేయరెడ్డిని బరిలో దింపాలని చూస్తున్నట్లు తెలిసింది.
జగన్కు వరుసకు బావమరిది అయ్యే రామాంజనేయరెడ్డి ఎన్నికల్లో పోటీ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన చింతకొమ్మదిన్నె జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. కుమారుడిని పోటీలోకి దించి, తాను వ్యాపారాలు చూసుకోవాలని రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటున్నారని తెలిసింది. మరోసారి జగన్ పేరు చెప్పి మాత్రమే ఓట్లు దండుకోవాలని ఆయన ప్లాన్ వేసినట్లు టాక్. మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ను ఆశీర్వదించాలని తన నియోజకవర్గ ప్రజలను రవీంద్రనాథ్ కోరుతున్నారని సమాచారం. మరోవైపు రామాంజనేయరెడ్డిని నిలబెడితే పరిస్థితి ఎలా ఉంటుందనే అంచనా కోసం కొడుకును వెంటబెట్టుకుని రవీంద్రనాథ్ పర్యటిస్తున్నారు.
అత్యంత దగ్గరి బంధువైన రవీంద్రనాథ్ కోరికను జగన్ కాదనే ఆస్కారం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో రామాంజనేయరెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. కానీ రవీంద్రనాథ్కు జాతకాల పిచ్చి ఉందని టాక్. అందుకే ఎన్నికల నాటి సమయం, ముహూర్తం చూసుకుని ఎవరు నిలబడితే గెలుస్తామో అని నిర్ణయిస్తారని కూడా అంటున్నారు. మరి ఎన్నికల్లో తండ్రి నిలబడతారా? కొడుకు బరిలో దిగుతారా? అన్నది చూడాలి.