పొంగులేటికి కేసీఆర్ దెబ్బ

ప్రభుత్వ నిర్ణయాల పరంగా, పార్టీలోని విషయాల పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కఠినంగా ఉంటారనే విషయం తెలిసిందే. పార్టీలో తోక ఎగిరేసే నాయకులను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే సొంత నేతలనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు పంపిస్తారనే టాక్ ఉంది. మరోవైపు ఇతర పార్టీల్లో చేరిన మాజీ బీఆర్ఎస్ నాయకులనూ కేసీఆర్ దెబ్బకొడతారనే అభిప్రాయాలున్నాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలోనే కేసీఆర్ అదే పని చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన ఖమ్మంలో భారీ సభ పెట్టి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి పొంగులేటి సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

కానీ తాజాగా పొంగులేటికి షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొంగులేటి వెంటే కాంగ్రెస్లో చేరిన ఆయన అనుచరులను ఒక్కొక్కరిగా తిరిగి బీఆర్ఎస్లో చేరేలా కేసీఆర్ ప్రణాళికలు అమలు చేస్తున్నారని తెలిసింది. తాజాగా పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావు, ఆయన భార్య ప్రవీణ, దమ్ముగూడెం జడ్పీటీసీ సభ్యురాలు సీతమ్మతో సహా కొంతమంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల సమయం నాటికి పొంగులేటిని ఒంటరిగా మార్చాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.