బీజేపీతో శ‌తృత్వం కంటే స్నేహ‌మే పెద్ద ప్ర‌మాదం…!

బీజేపీతో శ‌తృత్వం కంటే.. స్నేహ‌మే పెద్ద ప్ర‌మాద‌మా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీ తో స్నేహం చేసిన పార్టీలు, నాయ‌కుల‌ను గ‌మ‌నిస్తే.. ఆ పార్టీ వారిని ఏ విధంగా త‌న‌వైపు తిప్పుకొందో.. వారిని రాజ‌కీయంగా ఎలాంటి ప‌రిస్థితిలోకి నెట్టేసిందో కొన్ని రాష్ట్రాల్లో జ‌రిగిన ప‌రిణామాలు మ‌న‌కు స్ప‌ష్టం చేస్తా యి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీతో స్నేహం చేసిన పార్టీలు త‌ర్వాత కాలంలో కోరికోరి చేతులు కాల్చుకున్నాయి.

త‌మిళ‌నాడు: ఇక్క‌డ గ‌తంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే(జ‌య‌ల‌లిత‌) పార్టీ బీజేపీతో చేతులు క‌లిపి.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు చెప్పిన‌ట్టు న‌డిచారు. తీరా ఎన్నిక‌ల స‌మ‌యానికి బీజేపీని వ్య‌తిరేకించిన ప్ర‌జ‌లు(నీట్ స‌హా హిందీ బాష‌ను త‌మ‌పై రుద్ద‌డం) అన్నాడీఎంకేను చిత్తుగా ఓడించారు. దీంతో బీజేపీ కి జ‌రిగిన న‌ష్టం ఏమీలేదు. ఆ పార్టీతో స్నేహం చేసిన అన్నాడీఎంకేపై ప్ర‌జ‌లు న‌మ్మ‌కం కోల్పోయారు.

ఢిల్లీ: ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ.. బీజేపీతో కొన‌సాగించే వైరం అంద‌రికీ తెలిసిందే. ఢిల్లీ అధికార పార్టీని ఇరుకున పెట్టాల‌ని బీజేపీ, బీజేపీ చెప్పిన‌ట్టు త‌ను వినేది ఏంట‌ని ఆప్‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య పిల్లి-ఎలుక‌ల మాదిరిగా శ‌తృత్వం కొన‌సాగింది. అయితే.. దీనివ‌ల్ల ఆప్‌పై దేశవ్యాప్తంగా సింప‌తీని పెరిగింది త‌ప్ప‌.. బీజేపీ పై మాత్రం సానుభూతి పెర‌గలేదు. ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన ఢిల్లీ బిల్లు త‌ర్వాత‌.. బీజేపీని దేశ‌వ్యాప్తంగా ఈస‌డించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అలానే, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా.. స్నేహం క‌న్నా బీజేపీతో స‌మ‌ర‌మే కీల‌క‌మ‌ని భావిస్తారు. ఫ‌లితంగా బెంగాల్‌పై ఆమె ప‌ట్టు బిగించి ఉన్నారు. అలాకాకుండా.. శివ‌సేన‌లోని ఓ వ‌ర్గం.. బీజేపీతో స్నేహం చేసిన ద‌రిమిలా.. ఇక్క‌డ కొన‌సాగిన ప్ర‌భుత్వాన్ని కూల్చేసి.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న నేత‌ల‌తో మ‌రో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయించారు. అంటే.. మొత్తంగా చూస్తే.. బీజేపీతో స్నేహం క‌న్నా.. వైర‌మే నయమని అంటున్నారు ప‌రిశీల‌కులు.