ఆ పుకార్లు నమ్మొద్దంటోన్న బాలినేని

Balineni

వైసిపి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి కొంతకాలంగా రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో సీఎం జగన్ తో బాలినేనికి గ్యాప్ వచ్చిందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు నేతలను పిలిచి జగన్ పంచాయతీ కూడా చేశారని ఊహాగానాలు వినిపించాయి. ఇక, అంతకు ముందు నుంచే మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో జగన్ పై బాలినేని అలకబూనారని టాక్ నడుస్తోంది.

ఈ ఊహాగానాలన్నీ వెరసి త్వరలోనే బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒంగోలు టికెట్ బాలినేనికి ఇవ్వబోనని జగన్ తేల్చి చెప్పినట్లు పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నాను అన్న విషయంపై బాలినేని సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగానే తాను పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు. ఇక, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని క్లారిటీనిచ్చారు. తాను పోటీ చేసే స్థానంపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని బాలినేని కోరారు.

మరోవైపు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా స్లోగా ఉంటున్నానని జగన్ తనతో అన్న విషయాన్ని బాలినేని వెల్లడించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకునే క్రమంలో కొంత సమయం పడుతోందని, ఆ విషయాన్ని జగన్ కు తాను వివరించానని అన్నారు. హడావిడిగా, మొక్కుబడిగా కాకుండా సావధానంగా జనం సమస్యలను పరిష్కరించే దిశగా తాను వింటున్నానని, అందుకే ఒక్కొక్క ఇంటి దగ్గర ఎక్కువ సమయం పడుతుందని వివరణనిచ్చారు.