ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రధానమైన మూడు పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రాణ ప్రదంగా కూడా మారాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రాన్ని డెవలప్ చేస్తా మని.. అదేసమయంలో సంక్షేమాన్ని మరింత పెంచుతామని.. టీడీపీ చెబుతోంది. ఇక, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తమకు పట్టం కడతారని.. దేశంలోని ఏ రాష్రంలోనూ అమలు కాని విధంగా ఇక్కడ అనేక పథకాలు అమలు చేస్తున్నామని వైసీపీ చెబుతోంది.
ఇక, మరో పార్టీ జనసేన.. జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యమని ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రజల మూడ్ ఎలా ఉంది? వారు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో ఏ పార్టీకి కూడా ప్రజల నాడి తెలియడం లేదనేది గమనార్హం. ఎందుకంటే.. ఏ పార్టీ తరఫున నాయకులు.. ప్రజల్లోకి వెళ్లినా.. ప్రజలు వారికే జై కొడుతున్నారు. ఎవరు సభ పెట్టినా.. భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. దీంతో ప్రజల మూడ్‌ను పసిగట్టడం పార్టీలకు తలకు మించిన భారంగానే మారిందని చెప్పాలి.
ఈ క్రమంలో తాజాగా టీడీపీ, వైసీపీలు.. ఎన్నికల సర్వేకు రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. ఈ సర్వే ద్వారా.. ప్రజల మూడ్ ఎలా ఉంది? వారు ఏం కోరుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో పార్టీపై ఎలాంటి చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే నియోజకవర్గాలు ఎన్ని? అనే కీలక విషయాలపై ఈ సర్వే సాగనున్నట్టు సమాచారం. తద్వారా వచ్చే ఫీడ్ బ్యాక్‌ను అనుసరించి.. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను వండి వార్చాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా టీడీపీ అయితే.. ఇప్పటికే ప్రకటించిన మినీ మేనిఫెస్టో స్థానంలో మరిన్ని పథకాలు జోడించి.. మేనిఫెస్టోను తీసుకురావాలని భావిస్తున్నట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. చిత్రం ఏంటంటే.. ఒకవైపు వైసీపీ అనేక పథకాలు ఇస్తున్నామని.. చెబుతున్నా, మరోవైపు టీడీపీ నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నా.. జనసేనాని అప్పుడప్పుడు వచ్చి.. బాంబులు పేలుస్తున్నా.. జనం నాడిని మాత్రం పట్టుకోలేక పోతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates