విశాఖలో వారాహి విజయ యాత్ర సందర్భంగా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. జగన్ ను గద్దె దించే వరకు నిద్రపోనని, ఇకపై జగన్ పులివెందులకు పారిపోవాల్సిందేనని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కు వైసిపి నేతల నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ వి కారు కూతలని, పూనకం వచ్చిన వాడిలాగా ఊగిపోతుంటారని చురకలంటించారు.
సమయం సందర్భం లేకుండా సినిమా డైలాగులు ఆవేశంగా చెబుతుంటారని ఎద్దేవా చేశారు. సినీ హీరో చెప్పే డైలాగ్ లకు అభిమానుల నుంచి ఈలలు, కేకలు సహజమని అన్నారు. అదే మాదిరిగా పవన్ కు తాము గట్టిగా కౌంటర్ ఇస్తే ఏదో ఘోరం జరిగిపోయినట్టు రియాక్ట్ అవుతున్నారని అన్నారు. గాజువాకలో ఓడిపోయిన పవన్ కు ఆయన గెలవాలని లేదని, చంద్రబాబును గెలిపించడమే ఎజెండా అని ఎద్దేవా చేశారు. అంగళ్లు, పుంగనూరు దగ్గర పవన్ యజమాని చంద్రబాబు రెచ్చగొట్టిన విధానాన్ని ప్రజలంతా చూశారని సజ్జల అన్నారు.
ఆ సమయంలో పోలీసులు సంయమనంతో వ్యవహరించకపోతే ఘోరం జరిగి ఉండేదని చెప్పారు. లా అండ్ ఆర్డర్ ను దెబ్బతీయాలని కావాలనే చంద్రబాబు అలా కుట్ర చేశారని ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరిగిందని సీబీఐ విచారణ కోరుతున్న చంద్రబాబు గతంలో సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వనని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోడీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు రాసిన 9 పేజీలో లేఖలో ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవం లేదన్నారు. అధికారంలోకి రావాలనే ఉద్దేశం దత్తపుత్రుడికి లేదని, వీరావేశంతో పేజీలు కొద్ది స్క్రిప్ట్ చదవడం మాత్రమే తెలుసని అన్నారు. పవన్ కు అంత అహంకారమేంటని సజ్జల ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు అరాచక శక్తుల మూక అని, చంద్రబాబు దర్శకత్వంలో పవన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు చెల్లని నాణేల లాంటి పార్టీలు, ఫుల్ ఆర్కెస్ట్రా వంటి నేతలు అంటూ సెటైర్లు వేశారు. తాము చేసిన ఘనకార్యాలు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లే అవకాశం చంద్రబాబుకు ఉందని, కానీ దత్తపుత్రుడికి అవకాశం కూడా లేదని ఎద్దేవా చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates