ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు భూబకాసురులుగా మారుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలోని రుషికొండపై కూడా వైసీపీ నేతల కన్ను పడిందని పవన్ మండిపడ్డారు. ఇక విస్సన్నపేటలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరిట 600 ఎకరాల భూమి ఉందని పవన్ ఆరోపించారు. దీంతో, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విశాఖలో విలేకరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఆ భూమి తనదని నిరూపిస్తే ఒక్కో విలేఖరికి ఒక్కో ఎకరం ఇస్తానని, మిగిలిన భూమి జనసేన పార్టీకి రాసిస్తానని ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో పవన్ పర్యటించారు. ఆక్రమణలకు గురై, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ పై పవన్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర భూములను దోచుకుంటున్నారని, దీనికి జగన్ సమాధానం చెప్పి తీరాలని పవన్ డిమాండ్ చేశారు.
13వేల కోట్ల రూపాయలతో అనుమతులు లేనిచోట రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారని, ఈ 600 ఎకరాలు పోరంబోకు, దళితుల భూములని, ఇది క్యాచ్‌మెంట్ ఏరియా అని అన్నారు. ఈ దోపిడీకి స్థానిక ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సీఎం జగన్‌కే చెబుతున్నానని, మధ్యలో మంత్రులను పట్టించుకోననని గుడివాడ అమర్నాథ్ కు కౌంటర్ ఇచ్చారు.
ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకం.. కొండలను పిండి చేశారు, ప్రభుత్వ భూములు, రైతులు భూములను ఆక్రమించి వ్యాపారం విస్సన్నపేటకు వచ్చేదారిలో గ్రామాల్లో కనీసం రోడ్లు లేవని, ఇక్కడి రియాల్టీ వెంచర్‌లో 100 అడుగుల రోడ్డు, హెలీప్యాడ్ ఉన్నాయని దుయ్యబట్టారు. పర్యావరణాన్ని ధ్వంసం చేసి, సాగునీటి ప్రాజెక్టుల భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిపై గ్రీన్ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. వోల్టా యాక్ట్ కు తూట్లు పొడిచి మంత్రులు చేసే దోపిడీకి ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates