ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ దెబ్బ తగలనుందా? ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన గన్నవరం నియోజ కవర్గంలో పార్టీ మరింత బలహీన పడనుందా? ఇక్కడ కీలక నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తన దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారా? అంటే.. ఔననే అంటున్నారు స్థానిక నేతలు. 2019 ఎన్నికల్లో యార్లగడ్డ.. వైసీపీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, అప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ మద్దతుదారుగా ఉన్న వల్లభనేని వంశీ ఇక్కడ విజయం దక్కించుకున్నారు.
ఎన్నికలు అయ్యాక.. రెండు మూడు మాసాలకే.. ఆయన టీడీపీని విడిచి.. వైసీపీ పంచన చేరారు. అధికా రికంగా పార్టీ కండువా కప్పుకోకపోయినా.. వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున వంశీ ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు. అయితే.. ఆది నుంచి ఇక్కడ వైసీపీని డెవలప్ చేశామని.. తమకే టికెట్ ఇవ్వాలని యార్లగడ్డ కొన్నాళ్లుగా చెవిలో జోరీగలా రగడ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు బహిరంగ వ్యాఖ్యలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
అయినప్పటికీ.. వైసీపీ అధిష్టానం.. వెంకట్రావుకు ఎలాంటి అభయం ఇవ్వలేదు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యార్లగడ్డ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఆయన త్వరలోనే టీడీపీ కండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీకి ఇక్కడ ఇంచార్జి లేకపోవడం.. గతంలో ఉన్న బచ్చుల అర్జునుడు మృతి చెందిన దరిమిలా.. యార్లగడ్డ టీడీపీవైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర త్వరలోనే గన్నవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ…. త్వరలో లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకొంటున్నారని సమాచారం! ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి.. బెంజిసర్కిల్ నుంచి గన్నవరం వరకూ ర్యాలీ నిర్వహించి.. తన సత్తా నిరూపించాలని భావిస్తున్నట్టు ఆయన వర్గం నాయకులు లీకులు ఇస్తున్నారు. ఇదే జరిగితే.. ఎమ్మెల్యే వంశీ గెలుపు ఈ సారి అంత ఈజీకాదనే వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates