ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి.. సీఎం పీఠం అధిరోహించాలన్నది జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యం. అందుకు పొత్తులకు కూడా ఆయన వెనుకాడడం లేదు. మరోవైపు వారాహి యాత్ర కూడా పవన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజల ఆదరణ పొందేందుకు పవన్ సరైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత గద్దర్ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
ప్రజా గాయకుడు, ఉద్యమ గొంతుక గద్దర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. పాటతోనే ప్రయాణం చేసి.. పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ గద్దర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించారు. అంతకంటే ముందు ఆసుపత్రిలో గద్దర్‌ను పవన్ కలిసిన విషయం విదితమే. ఆసుపత్రిలో గద్దర్‌ను పరామర్శించిన పవన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ గద్దర్ అనారోగ్యం క్షీణించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
గద్దర్‌తో చివరి సారిగా మాట్లాడిన మాటలను పవన్ తాజాగా బయటపెట్టారు. తన గెలుపును గద్దర్ కోరుకున్నారని పవన్ చెప్పారు. గద్దర్ మాట్లాడిన చివరి మాటలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నారు. కాలం చాలా గొప్పది, దాని ముందు ఎవరైనా మోకారిల్లాల్సిందేనని గద్దర్ చెప్పారు. దేశంలో ప్రస్తుతం 60 శాతం మంది యువత ఉన్నారని, వారికి సరైన నాయకత్వం వహించే నాయకుడు కావాలని గద్దర్ అన్నారని పవన్ చెప్పారు. ఈ తరానికి సరైన మార్గనిర్దేశనం ఇస్తావని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని గద్దర్ అన్నారన్నారు. అంతే కాకుండా తాను విజయం సాధించాలని గద్దర్ కోరుకున్నారని పవన్ పేర్కొన్నారు. మరి గద్దర్ అన్నట్లు పవన్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం సాధిస్తారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates