జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మూడో విడత వారాహి విజయయాత్రలో వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అన్నయ్య చిరంజీవి, మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతుగా నిలవడంతో పవన్ మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం నాటికి మెగా కుటుంబం నుంచి ఒక్కొక్కరిగా పవన్‌కు అండగా నిలిచేందుకు ముందుకు వస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జనసేన కార్యకర్తలు సంతోషంలో మునిగిపోతున్నారనే చెప్పాలి.
పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి చిరంజీవి పెద్దగా రాజకీయాల గురించి కానీ, పవన్ పొలిటికల్ విషయాల గురించి కానీ బయట మాట్లాడలేదు. కానీ ఇటీవల యాక్టర్ల రెమ్యునరేషన్ గురించి ప్రభుత్వాలకు ఎందుకు, రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదా, రోడ్లు, ప్రజల గురించి పట్టించుకోవాలని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు కూడా తీవ్రంగానే స్పందించడంతో పొలిటికల్ హీట్ ఏర్పడింది. మరోవైపు తమ్ముడికి చిరంజీవి మద్దతుగా రావడంతో జనసేన కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి.
ఇప్పుడిక పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ రాజకీయంగా పవన్‌కు మద్దతునిస్తూనే ఉంటానని వెల్లడించారు. సమాజం కోసం పవన్ పనిచేస్తున్నారని చెప్పారు. పిల్లలను, కుటుంబాలను రాజకీయాల్లోకి లాగొద్దని కూడా పేర్కొన్నారు. ఇన్ని రోజులు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పవన్‌పై వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. ఇప్పుడీ విషయంపై రేణు దేశాయ్ స్పందించడంతో వైసీపీ నేతలకు చెక్ పెట్టినట్లు అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని పక్కనపెట్టి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రేణు కోరారు. మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపాలని, నలుగురు పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దని కూడా ఆమె చెప్పారు.