జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో సంచలనమే చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన కుటుంబానికి చెందిన వారు ఎవరూ కూడా నేరుగా బయటకు మద్దతు ప్రకటించింది లేదు. ఒక్క నాగబాబు మాత్రం పార్టీలో నాయకుడిగా ఉండడం, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే. ముఖ్యంగా మెగా కుటుంబానికి చెందిన మహిళలు ఎవరూ కూడా బయటకు రాలేదు.
అయితే, తాజాగా పవన్ మాజీ సతీమని రేణూ దేశాయ్.. పవన్‌కు మద్దతుగా నిలిచినట్టు ప్రకటించారు. పవన్ డబ్బుల మనిషి కాదని, ఆయన ప్రజల కోసమే సినిమాలను, కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టి వచ్చారని చెప్పారు. ప్రజలంతా కూడా.. ఆయనకు మద్దతుగా ఉండాలని రేణూ వ్యా ఖ్యానించారు. తాను పవన్‌కు దన్నుగా ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కఛాన్స్ ఇవ్వాలంటూ.. ప్రజలను ఉద్దేశించి పవన్ తరఫున విజ్ఞప్తి చేశారు.
కట్ చేస్తే.. రేణూ దేశాయ్ ఇచ్చిన పిలుపుతో జనసేనకు ఏమేరకు ప్రయోజనం చేకూరుతుందనేది ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పటి వరకు మహిళా ఓటు బ్యాంకు విషయంలో పవన్ పెద్దగా దృష్టి పెట్టలేదు. రాష్ట్రం లో వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం దక్కించుకోవాలన్నా.. ఎవరు అధికారంలోకి రావాలన్నా.. మహిళా ఓటు బ్యాంకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఇప్పుడు రేణు చేసిన వ్యాఖ్యలు మహిళా కోణం చూసుకుంటే ఎంత వరకు వర్కవుట్ అవుతాయనేది ఆసక్తిగా మారింది.
నిజానికి మహిళా ఓటు బ్యాంకును ఇటు వైసీపీ, అటు టీడీపీ కూడా పంచుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు ఎక్కువగా వైసీపీకి దక్కిందనే అంచనాలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు మహిళ మహా శక్తి పేరుతో టీడీపీ ఈ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో రేణు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే.. జనసేన వైపు కూడా మహిళలు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ దిశగా అడుగులు పడతాయో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates