ఉత్తరాంధ్రలో జనసేనకు బలం పెరుగుతోందా ?

ఉత్తరాంధ్రలో జనసేన బలం పెరుగుతున్నదా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీమంత్రి పడాల అరుణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈమె జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. మూడుసార్లు కూడా టీడీపీ తరపునే గెలిచారు. అలాగే ఈ మధ్యనే పంచకర్ల రమేష్ కూడా జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

రమేష్ కూడా రెండు సార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. మొదటి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నుండి గెలిచారు. తర్వాత 2014లో ఇదే జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ తరపున గెలిచారు. ఇంతకాలం వైసీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రమేష్ జనసేనలో జాయిన్ అయ్యారు. అంటే విశాఖపట్నం జిల్లాలోను, విజయనగరం జిల్లాలోను చెరో నేత చేరారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఎవరెవరు జనసేనలో చేరుతారో అనే చర్చ ఊపందుకుంది.

పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తమకు కచ్చితంగా టికెట్ రాదని తీర్మానించుకున్న వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏలు లేదా సీనియర్ నేతలు జనసేనలో చేరే అవకాశాలున్నాయట. టీడీపీ, జనసేన పొత్తుంటే తాము చేర్చుకుంటున్న నేతలకు పోటీచేసే అవకాశం ఉందా లేదా అన్నది స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే చేరికలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. ఒకవేళ పొత్తులు లేకపోతే అందరికీ హ్యాపీయే.

మామూలుగా అయితే 175 నియోజకవర్గాల్లోను జనసేన గట్టి అభ్యర్ధులను వెతుక్కోవాల్సిందే. కాకపోతే బీజేపీ మిత్రపక్షంగా ఉందికాబట్టి తక్కువల తక్కువ 120 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్దులను వెతుక్కోవాల్సుంటుంది. అప్పుడు పంచకర్ల రమేష్, పడాల అరుణ లాంటి చాలామందికి టికెట్లు దక్కుతాయి. అందుకనే పార్టీ బలోపేతానికి పవన్ వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే వారాహియాత్ర మొదలైన తూర్పుగోదావరి జిల్లాల్లో గట్టి నేతలు ఎవరు పార్టీలో చేరలేదు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోను చేరలేదు. అలాంటిది విశాఖ పర్యటనలో చేరుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.