చిరంజీవిపై సాయిరెడ్డి సెటైర్లు

సినిమా హీరోల రెమ్యునరేషన్ల అంశంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించిన వైనంపై ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి పెద్దల సభలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటూ మెగా స్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆ కామెంట్ల తర్వాత వైసీపీ ప్రో గా ఉన్న చిరంజీవి కాస్తా…బ్రో పవన్  మాదిరిగానే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాము వేలాదిమందికి ఉపాధి కల్పించాన్న ఉద్దేశ్యంతోనే సినిమాల మీద సినిమాలు తీస్తుంటామని, అందులో తమ స్వార్థం ఏమీ లేదని చిరు అన్నారు.

ఈ క్రమంలోనే చిరు కామెంట్లపై విజయసాయిరెడ్డి స్పందించారు. కొందరు హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ, వీలైతే ఉచితంగా నటిస్తూ, లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. కళామతల్లిపై ప్రేమతో సినిమాలు చేస్తున్నారని, తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారని చురకలంటించారు. అటువంటి హీరోలకు హ్యాట్సాఫ్ అని పంచులు వేశారు.

సినీ రంగం ఆకాశం నుంచి ఊడి పడలేదంటూ విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిలిం స్టార్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా ప్రజజారణ ఉంటేనే వారి మనుగడ అని అన్నారు. పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని చెప్పారు. వారి గురించి ప్రభుత్వానికి ఎందుకు అని ప్రశ్నిస్తే కుదరని, వారి యోగ క్షేమాలను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు.