బీఆర్ఎస్ ట్రాప్‌లో రేవంత్‌

బీఆర్ఎస్ ట్రాప్‌లో రేవంత్ ప‌డ్డారా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. తెలంగాణ‌లోనే పుట్టిన రేవంత్‌కు తెలంగాణ‌వాదిన‌ని నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని? ఆయ‌న ఆ ప్ర‌య‌త్నం చేస్తున్నారంటే క‌చ్చితంగా బీఆర్ఎస్ ట్రాప్‌లో చిక్కుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చంద్ర‌బాబు తెలంగాణ ద్రోహి అని విమ‌ర్శిస్తున్న బీఆర్ఎస్ నాయ‌కులు.. బాబు అనుచ‌రుడిగా రేవంత్‌కు ముద్ర వేస్తూ రాష్ట్రానికి కీడు చేస్తాడ‌నే ప్ర‌చారాన్ని మొద‌లెట్టారు.

చంద్ర‌బాబు అనుచ‌రుడిగా ఉండి, ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌కు తెలంగాణ గురించి మాట్లాడే హ‌క్కు లేదంటూ బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీటిపై రేవంత్ తాజాగా స్పందించారు. కేసీఆర్ కూడా ఒక‌ప్పుడు టీడీపీ నాయ‌కుడేన‌ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా గెలిచిన త‌ర్వాత తాను టీడీపీలో చేరాన‌ని, కానీ కాంగ్రెస్ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురై కేసీఆర్ టీడీపీలోకి వ‌చ్చార‌ని రేవంత్ ఆరోపించారు.

అయితే ఇక్క‌డ బాబు శిష్యుడిగా రేవంత్‌ను పేర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌లు ఒక విష‌యాన్ని గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. రేవంత్ ఏనాడూ టీడీపీలో ఉంటానంటూ ప్రాధేయ‌ప‌డ‌లేద‌ని అంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం.. రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఒదిగి ఉన్నార‌ని, ఇప్ప‌టికీ ఆ ఫొటోలు అందుబాటులో ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో రేవంత్‌.. బీఆర్ఎస్ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు బ‌దులివ్వాల్సిన అవ‌స‌రం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయ‌కులు ఏదో అన్నారు కాబ‌ట్టి రేవంత్ స్పందించారు. రేపు మ‌రో పార్టీ కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తే రేవంత్ మ‌ళ్లీ స్పందిస్తారా? ఇలా జ‌వాబులు చెప్పుకుంటూనే పోతే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కాబ‌ట్టి బీఆర్ఎస్ నేత‌ల మాట‌లు ప‌ట్టించుకోకుండా రేవంత్ త‌న ప‌ని తాను చేసుకుంటే మంచిద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.