జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు(గురువారం) నుంచి చేపట్టనున్న వారాహి యాత్ర 3.0పై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎక్కడా రోడ్ షో చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. అదేవిధంగా అభిమానులతో కలిసి కరచాలనాలు.. వాహనం(ఓపెన్ టాప్)పైకి ఎక్కి అభివాదాలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలోనూ ఎవరినీ కలిసేందుకు, అభివాదాలు, నినాదాలు చేసేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు.
అలానే, విశాఖ విమానాశ్రయం నుంచి కేవలం పోర్టు రోడ్డు ద్వారా మాత్రమే పవన్ కాన్వాయ్ వెళ్లాలని.. కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఎలాంటి ఆర్భాటాలు, నినాదాలు.. జెండా ఎగరవేతలు ఉండేందుకు వీల్లేదని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విమానాశ్రయం నుంచి నేరుగా జగదాంబ సెంటర్‌కు చేరుకుని అక్కడ సభ నిర్వహించుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు విశాఖపట్నం పోలీసు కమిషనర్ కార్యాలయం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.
అదేసమయంలో పవన్ సభకు వచ్చేవారికి పాస్‌లు మంజూరు చేయాలని ఒక్కపాస్‌పై కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీలు చేసి.. పాస్‌లేని వారిని అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందని పేర్కొన్నారు. కాగా, ఈ రోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు కూడా పవన్ వారాహి యాత్రను నిర్వహించనున్నారు. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన యాత్ర సాగనుందని జనసేన వర్గాలు తెలిపాయి.