పురందేశ్వ‌రి మేడంకు.. బీజేపీ పాఠాలు ఒంట‌బ‌ట్టిన‌ట్టు లేవే..!

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా బాధ్య‌తలు చేప‌ట్టిన పురందేశ్వ‌రిపై నెటిజ‌న్లు అప్పుడే ట్రోల్స్ ప్రారంభించా రు. గురువారం నుంచి ఆమె పార్టీ త‌ర‌ఫున‌.. రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచుల స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఇది మంచిదే. ఎవ‌రికి అన్యాయం జ‌రిగినా.. అందుకు.. ప్ర‌తిప‌క్షంగా ఆమె అందుబాటు లో ఉండాలి. కార్య‌క్ర‌మాల ద్వారా ఆమె త‌న గ‌ళం కూడా వినిపించాలి. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. అయితే.. వాస్త‌వానికి బీజేపీకి అంటూ.. ఒక సిద్ధాంతం ఉంది.

ఇత‌ర స‌మ‌స్య‌ల‌క‌న్నా.. కూడా బీజేపీకి హిందూత్వ అజెండానే కీల‌కం. ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూనే.. హిందూత్వానికి మ‌చ్చ వ‌చ్చే స‌మ‌స్య‌లు ఉంటే.. ముందుగావాటినే త‌మ అజెండాలో చేర్చుకుంటారు. ఇలానే.. ద‌గ్గుబాటి కూడా.. వ్య‌వ‌హ‌రిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. గ‌త పార్టీ చీఫ్ సోము వీర్రాజు ఇలానే ముందుకు సాగారు. హిందూత్వ స‌మ‌స్య‌ల‌పైనే ఆయ‌న ఎక్కువ‌గా ఫోక‌స్ చేశారు. దీంతో కేంద్రంలో ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. కానీ, పురందేశ్వ‌రి ఈ సూత్రాన్ని మ‌రిచిపోయార‌నే టాక్ వినిపిస్తోంది.

లేదా.. ఆమెకు బీజేపీ విధానాలు ఒంట‌బ‌ట్ట‌లేదా? అని బీజేపీ నాయ‌కులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకం టే.. రాష్ట్రంలో వ‌రుస‌గా ఆల‌యాల్లోని పూజారుల‌పై దాడులు జ‌రిగాయి. బెదిరింపులు కూడా వ‌చ్చాయి. ఉమ్మ‌డి ప‌శ్చిమ‌లోని సోమేశ్వ‌రాల‌యంలో పూజారిపై వైసీపీ నాయ‌కుడు దాడి(చైర్ ప‌ర్స‌న్ భ‌ర్త‌) చేయ డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై బీజేపీ మిత్ర‌ప‌క్షంజ‌న‌సేన స్పందించింది. పార్టీ నాయ‌కుడు ప‌వ‌న్ ఏపీ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.

ఇక‌, అనంత‌పురంలో జిల్లా అధికారి ఒక‌రు.. పూజారుల‌ను బెదిరించి.. అంతు చూస్తాన‌ని చెప్పారు. ఇక, మ‌రికొన్ని ఘ‌ట‌న‌ల్లోనూ పూజారుల‌ను వైసీపీ నాయ‌కులు అవమానించారు. వీటిపై జ‌న‌సేనాని ప‌వ‌న్ రియాక్ట్ అయ్యారు. కానీ, హిందూత్వ అజెండాను మోస్తున్న పార్టీ అధ్య‌క్షురాలిగా.. పురందేశ్వ‌రి క‌నీసం ఆయా అంశాల‌ను ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం.. చిన్న సందేశం(ట్వీట్‌) కూడా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని ఇటు పార్టీలోనూ.. అటు బ‌య‌ట కూడా ప‌లువురు త‌ప్పుబ‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.