మెగా బ్ర‌ద‌ర్స్ వ‌ర్సెస్ వైసీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజకీయం మ‌రోసారి వేడెక్కింది. ఇన్ని రోజులు రాజ‌కీయ అంశాల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా సైలెంట్‌గా ఉన్న చిరంజీవి ఒక్క‌సారిగా వైసీపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. యాక్ట‌ర్ల రెమ్యున‌రేష‌న్ సంగ‌తి ప‌క్క‌న‌పెట్టి.. ఏపీలో అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి పెట్టాల‌ని, ప్రత్యేక హోదా అంశాన్ని ప‌ట్టించుకోవాల‌ని చిరంజీవి గ‌ట్టిగానే చుర‌కంటించారు. మ‌రి చిరంజీవి వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌కుండా వైసీపీ నాయ‌కులు ఉంటారా? లేదు క‌దా.. ఊహించిన‌ట్లే వైసీపీ నేత‌లు తీవ్రంగానే స్పందిస్తున్నారు.

వైసీపీ నేత‌లు చిరుపై ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగ‌డంతో ఇప్పుడు ఏపీలో రాజ‌కీయం మెగా బ్ర‌ద‌ర్స్ వ‌ర్సెస్ వైసీపీగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇన్ని రోజులు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను, ఆయ‌న చిన్న‌న్న‌య్య నాగ‌బాబును ల‌క్ష్యంగా చేసుకుని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు కూడా ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో మాట‌ల యుద్ధం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇప్పుడు ఇందులోకి మెగాస్టార్ వచ్చార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇన్ని రోజులు త‌మ్ముళ్ల‌ను ఎన్ని మాట‌ల‌న్నా నోరు మెద‌ప‌ని అన్న‌య్య‌.. ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రెచ్చిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా అన్న‌య్య రంగంలోకి దిగుతారనే ప్ర‌చారం ఊపందుకుంది. అంతేకాకుండా ఆయ‌న జ‌న‌సేన‌లో చేరి మ‌రోసారి రాజ‌కీయ బ‌రిలో అడుగుపెడ‌తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరు వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి ఏపీలో రాజ‌కీయం మాత్రం వేడెక్కింద‌నే చెప్పాలి. మ‌రి అన్న‌య్య‌పై వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్‌, నాగ‌బాబు ఎలా రియాక్ట‌వుతారో చూడాలి.