తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి సారించాయి. పార్టీ తరపున బరిలో దిగి విజయాన్ని సాధించే అభ్యర్థులు ఎవరని జల్లెడ పడుతున్నాయి. అంతర్గత సర్వేలు, ప్రైవేట్ సంస్థల సర్వేల ఆధారంగా ఓ అంచనాకు వచ్చి త్వరలోనే పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి.
అయితే ఏ నియోజకవర్గంలోనైనా ప్రతి పార్టీలో ఇద్దరు, ముగ్గురు కీలక నేతలు ఉండడం సాధారణమే. ఇందులో ఒకరికే టికెట్ ఇస్తే మరి మిగతా ఇద్దరి సంగతి ఎలా? అనే ప్రశ్న రేకెత్తుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి సెగ ఎక్కువైంది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్.. ఇలా చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అసంతృప్త నేతలు ప్రతి పార్టీలోనూ ఉన్నారు. వీళ్లను బుజ్జగించేందుకు కీలక నేతలు బరిలో దిగినా ఫలితం దక్కకపోతే ఎలా అన్న సందేహం నెలకొంది.
వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థి కాకుండా ఆ తర్వాత ఉండే కీలక నేతల పంట పండనుంది. ఒకవేళ బీఆర్ఎస్‌లో అవకాశం రాకపోతే ఇలాంటి అభ్యర్థులు కాంగ్రెస్, బీజేపీలోకి చేరే ఆస్కారముంది. ఇప్పటికే వివిధ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం చూస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఇలాంటి నేతల అవసరం ఉంది. అందుకే పార్టీలో చేర్చుకుని సీటిచ్చే అవకాశాలే ఎక్కువు.
ఇక అధికార బీఆర్ఎస్ కూడా అందుకు మినహాయింపేమీ కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీలోని బలమైన నేతలను బరిలో దించేలా అధినేత కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. ప్రత్యర్థి పార్టీ నేతలను చేర్చుకుని టికెట్ కేటాయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇన్ని రోజులు ప్రధాన నాయకుడి వెనకాల ఉన్న నేతలకూ ఇప్పుడు అవకాశాలు దక్కబోతున్నాయనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates