టికెట్ కావాలా.. అయితే స‌ర్వేను అడుగుదాం!

తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు నెల‌ల స‌మయం కూడా లేదని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలన్నీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. ఈ నెల‌లోనే అధికార బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ త‌మ అభ్య‌ర్థుల తొలి జాబితాను ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే ఈ అభ్య‌ర్థుల ఎంపిక‌కు స‌ర్వేలపైనే పార్టీలు ఆధారప‌డ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం.

సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇవ్వాల‌న్నా.. కొత్త అభ్య‌ర్థికి అవ‌కాశం క‌ల్పించాల‌న్నా.. మాజీ ఎమ్మెల్యేను మ‌ళ్లీ నిలబెట్టాల‌న్నా పార్టీల‌న్నీ స‌ర్వేల‌నే న‌మ్ముకున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే అధికార బీఆర్ఎస్ పార్టీ స‌ర్వేల ఆధారంగానే అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే కొన్ని స‌ర్వేల ఫ‌లితాల్లో ప్ర‌ద‌ర్శ‌న అంతంత‌మాత్రంగానే ఉన్న ఎమ్మెల్యేల‌ను కేసీఆర్ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ప‌ని తీరు మార్చుకోకుంటే వేటు త‌ప్ప‌ద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నార‌ని తెలిసింది.

మ‌రోవైపు కాంగ్రెస్ కూడా తొలి జాబితా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకు ఆ పార్టీ అంత‌ర్గ‌త స‌ర్వేల‌పైనే ఆధార‌ప‌డింది. జాబితా ప్ర‌క‌ట‌న కోసం అధిష్ఠానం నుంచి అనుమ‌తి రావ‌డంతో టీపీసీసీ జోరు పెంచ‌నుంది. ఇప్ప‌టికే ఉన్న స‌మాచారంతో పాటు తాజా స‌ర్వేల ద్వారా సేక‌రించుకున్న అభిప్రాయాల‌ను బ‌ట్టి అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇవ్వ‌నుంది. బీజేపీ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, అరుణ‌, ల‌క్ష్మ‌ణ్‌లు ఏకాభిప్రాయంతో తొలి జాబితాను సిద్ధం చేయాల‌ని అధిష్ఠానం సూచించింది. దీనికి కూడా ఈ పార్టీ స‌ర్వేల‌నే కొల‌మానంగా తీసుకుంటోంద‌ని టాక్‌. మొత్తానికి సీటు ద‌క్కాలంటే.. స‌ర్వేలో మెరుగైన ఫ‌లితం రావాల్సిందేన‌ని నేత‌లు ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది.