ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఏపీ అధికారపక్షానికి చెందిన ఆయన.. సొంత పార్టీ మీదనే ఆయన విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెడుతున్నారు. నిత్యం ఏదో ఒక అంశం మీద స్పందించే ఆయన.. తాజాగా ఏపీని ఊపేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై రియాక్ట్ అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభుత్వం తక్షణం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ను ప్రస్తావించారు. హైదరాబాద్ లోని పార్కు హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేశ్.. కామినేని శ్రీనివాస్.. సుజనా చౌదరి సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. దుష్ట చతుష్టయం అని ట్వీట్ చేశారని.. మరి నాలుగో వ్యక్తి ఎవరని రఘురామ ప్రశ్నిస్తున్నారు.
ఫేస్ టైమ్ లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరి విజయసాయి ట్వీట్ చేశారని.. హిచ్ కాక్ సస్పెన్స్ సినిమాలో పెట్టిన ఆ ట్వీట్ చూస్తే.. అన్ని అంశాల్ని ట్యాప్ చేసి వింటున్నారని చెప్పకనే చెప్పారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. భయానికి గురి చేసేందుకు అలా ట్వీట్ చేశారా? లేదంటే.. నిజంగానే జరుగుతుందా? అని ప్రశ్నించారు.
ట్యాపింగ్ అంశాలపై సామాన్యుల్లో బోలెడన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారు మీద ఉందన్న రఘురామ.. జగన్ తనకు సమయం ఇస్తే మరిన్ని విషయాల్ని చెబుతానన్నారు.
రచ్చబండ మీద అన్ని అంశాలు మాట్లాడలేమని.. జగన్ కానీ తనకు సమయం ఇస్తే.. అన్ని విషయాలు ఆయనతో మాట్లాడతానని చెప్పారు.
న్యాయవ్యవస్థపై టెలిఫోన్ నిఘా ఉన్నట్లు రుజువైతే మాత్రం అది ప్రభుత్వానికి మచ్చగా మారుతుందన్నారు. ప్రభుత్వంలో ఏ ఒక్కరు తప్పు చేసిన ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అయితే.. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన.. ముఖ్యమంత్రి జగన్ కు ట్యాపింగ్ ఉదంతంలో సంబంధం లేదన్న విషయం అందరికి తెలుసంటూ రఘు రామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యాయ వ్యవస్థపై ట్యాపింగ్ ఉదంతంలో జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చేసిన రఘురామ రాజు.. అందుకు భిన్నంగా ఆయన నోటి నుంచి వచ్చిన అదృశ్య శక్తి ఎవరన్నదే అసలు ప్రశ్న. దీనికి రఘు రామ మాత్రమే సరైన సమాధానం చెప్పగలరేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates