కాంగ్రెస్ అగ్రనేత, ఇటీవల తనపై ఉన్న రెండేళ్ల జైలు శిక్ష నుంచి ఒకింత ఊరట పొందిన రాహుల్‌గాంధీపై బీజేపీ నాయకులు సటైర్లు కుమ్మేశారు. “రండి అరుణాచల్ ప్రదేశ్ చూపిస్తా” అని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సహా.. పలువురు బీజేపీ నేతలు.. ఆయనను లోక్‌సభలోనే ఆట పట్టించారు. దీనిపై మాట్లాడేందుకు ఏమీ కనిపించకపోవడంతో రాహుల్ గాంధీ మౌనంగా చూస్తుండి పోయారు. దీంతో మరింతగా బీజేపీ ఎంపీలు, మంత్రులు సటైర్లతో విరుచుకుపడ్డారు.
ఏం జరిగింది?
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జోరుగా సాగింది. పలు అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయగా, అధికార పార్టీ ఎంపీలు నరేంద్ర మోబా ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి పనులను పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. అదేసమయంలో విపక్ష పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితులు, దాడులు, అత్యాచారాలు, అక్రమాలు వంటి వాటిని ప్రస్తావించి విపక్ష నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే భారత్ సరిహద్దు వెంబడి చైనా ఆక్రమణలపై కాంగ్రెస్ ఎంపీలు పదేపదే విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. రాహుల్ వైపు చూసి.. “అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమిత ప్రాంతాలు నిజానికి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అప్పగించనవే. అసలు సత్యం ఎరుకపరచేందుకు పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే అరుణాచల్ తీసుకువెళ్తా. స్వయంగా ఖర్చు నేనేపెట్టుకుంటా. వస్తారా” అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
అంతేకాదు.. గత చరిత్రను కూడా ఈ సందర్భంగా రిజుజు ప్రస్తావించారు. ‘1962లో లద్దాఖ్, అరుణాచల్‌పై చైనా దాడి చేసింది. మన భూభాగాన్ని కాపాడాలంటూ అప్పుడు వాజ్‌పేయి మాట్లాడారు. అప్పటికి నేను పుట్టలేదు. అయినా చరిత్ర, రికార్డులు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. పశ్చిమ అరుణాచల్ మొత్తాన్ని చైనా పట్టుకుని అసోం వచ్చింది. అసోం ప్రజలను తలచుకుంటే తన హృదయం ద్రవిస్తోందని నెహ్రూ ఒక సందేశం ఇచ్చారు. అసోం ప్రజల బాధ గురించి మాట్లాడారే కానీ.. చైనా ఆక్రమించిన ప్రతి అంగుళం భూమిని మన భారత బలగాలు వెనక్కి తెస్తాయని కానీ, ఎవరూ భయపడవద్దని కానీ నెహ్రూ చెప్పి ఉండాల్సింది” అని చురకలు అంటించారు. అందుకే అసలు ఏం జరిగిందో చూపించేందుకు మిమ్మల్ని(రాహుల్ సహా కాంగ్రెస్ ఎంపీలు) తీసుకువెళ్తా.. వస్తారా? అని ప్రశ్నించారు.