తప్పు చేసినట్లు తెలిస్తే చాలు వేటు వేసేస్తున్న సోము

ఆదర్శాలు వల్లించటం ఎవరైనా చేస్తారు. అందులోనూ రాజకీయ నేతల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మాటల్లో కనిపించే పదును చాలామంది నేతల చేతల్లో కనిపించదు. తాజాగా ఆ విషయంలో తనను వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వని రీతిలో వ్యవహరిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇటీవల పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టిన ఆయన.. తప్పు చేసిన వారు సొంత పార్టీ వారైనా అస్సలు ఉపేక్షించటం లేదు.

ఇటీవల కాలంలో పలువురి మీద వేటు వేస్తున్న ఆయన.. తాజాగా మరో నేత మీద సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులపై ఒక పత్రికకు రాసిన వ్యాసం.. పార్టీ లైన్ కు భిన్నంగా ఉండటంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రమణను సస్పెండ్ చేశారు. అమరావతి రైతుల పక్షాన బీజేపీ పోరాడలేకపోతుందని వ్యాఖ్యానించిన వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రెండు ఉదంతాలకు భిన్నంగా తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబు పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనటాన్ని పార్టీ సహించదని.. చర్యలు తీసుకోవటం ఖాయమని తేల్చి చెప్పారు.

నేతలు ఎవరైనా సరే.. పార్టీ క్రమశిక్షణకు లోబడి పని చేయాలని ఆయన చెబుతున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ ఏపీ శాఖకు చెందిన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇంతకీ ఈ అంజిబాబు ఎవరు? ఆయన స్థాయి ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. 2019 లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఆ స్థాయి నేత తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు పెద్ద ఎత్తున మద్యాన్ని తరలిస్తూ దరికిపోయారు. వారి నుంచి రూ.6లక్షల విలువైన 1920 మద్యం బాటిళ్లతో పాటు.. మూడు కార్లను స్వాధీనం చేశారు. మొత్తానికి సోము కత్తికి పదును ఎక్కువని.. తప్పు చేస్తే వేటే అన్న విషయాన్ని స్పష్టం చేసేలా నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పక తప్పదు.