వినాయకచవితి సమీపిస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా ఈ సారి వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయా లేదా? అని పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చకు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. హైదరాబాదీలకు వెరీవెరీ స్పెషల్ అయిన వినాయకచవితి… కళను కూడా కరోనా పోగొట్టేసింది.
గణేష్ పండగ వస్తే పదిరోజుల పాటు గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినలేం. ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ…. ప్రభుత్వం అధికారికంగా చెప్పేసింది.
కరోనా నేపథ్యంలో ఉత్సవాలు నలుగురు కలిసి జరుపుకునే పరిస్థితులు లేని నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు గణేష్ ఉత్సవాలను ఇళ్లేక పరిమితం చేసుకోవాలని, ఇళ్లలోనే గణేష్ ప్రతిమలను ప్రతిష్టించుకుని పూజలు నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వినాయక చవితి ఉత్సవాలలో కీలక పాత్ర పోషించే హోంశాఖ ప్రత్యేక సమావేశంలో నగరానికి చెందిన మంత్రి తలసాని, హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసి కమిషనర్, భాగ్యనగర్ గణేష్‌ఉత్సవ సమితి నాయకులు హాజరయ్యారు. ఇపుడిపుడే స్వల్పంగా కరోనా కర్వ్ ఫ్లాట్ అవుతున్న నేపథ్యంలో వేడుకలు సామూహికంగా జరుపుకునే పరిస్థితి లేదని నిర్ణయానికి వచ్చారు. ఉత్సవాలపై నిషేధానికి అందరూ సమ్మతించారు.
హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ సామూహిక వేడుకలపై నిషేధం గురించి ట్విట్టర్లో ప్రకటించారు. ఇప్పటికే బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలాన్ని రద్దు చేయడం, ఖైరతాబాద్ వినాయకుడిని కూడా అతి తక్కువ ఎత్తులో రూపొందిస్తుండటం తెలిసిందే.
అన్ని ఆలయాల్లో నవరాత్రులు
వినాయక చవితి ఉత్సవాలను, మొహర్రం పండగను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జన సమూహం లేకుండా పండగలను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు, ప్రార్థనలు ఉండవని… ఇది మనందరి క్షేమం కోసమే అన్నారు. ఆలయాల్లో వినాయకచవితి నవరాత్రులను శాస్త్రోక్తంగా నిర్వహించాలని ఈమేరకు దేవాదాయ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates