బాబు, లోకేష్‌ల భ‌ద్ర‌త ఎలా ఉంది? ..ప్ర‌భుత్వానికి కేంద్రం లేఖ‌

Lokesh Chandrababu

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అగ్ర‌నేత‌లు.. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ల భ‌ద్ర‌త విష‌యంపై కేంద్ర హోం శాఖ తాజాగా వైసీపీ ప్ర‌బుత్వాన్ని వివ‌ర‌ణ కోరింది. వారికి ఎలాంటి భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు? వారి ప‌ర్య‌ట‌న‌ల్లో దాడులు ఎందుకు జ‌రుగుతున్నాయి? వంటి విష‌యాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ.. తాజాగా డీజీపీకి లేఖ రాసింది.

చంద్రబాబు, నారా లోకేష్‌ల భ‌ద్ర‌త విష‌యంలో తీసుకున్న చ‌ర్య‌ల‌ను త‌మ‌కు మినిట్స్ రూపంలో పంపించాల‌ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్, డీజీపీలకు హోంశాఖ లేఖ రాసింది. మరీ ముఖ్యంగా.. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై గ‌తంలో జరిగిన దాడులపై వివ‌రాలు కోరింది. అదేవిధంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను కూడా త‌మ‌కు వివ‌రించాల‌ని కోరింది.

నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు కల్పించిన భద్రత వివరాలను కూడా ఇవ్వాల‌ని కోరింది. అదేవిధంగా.. గత నవంబరు 4న నందిగామలో చంద్రబాబు ర్యాలీలో జరిగిన రాళ్ల దాడిపై కూడా హోంశాఖ నివేదిక ఇవ్వాలని కోరింది. ఏమాత్రం జాప్యం చేయకుండా.. చంద్రబాబు, లోకేష్‌లకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్‌లను హోంశాఖ ఆదేశించింది.

గత కొన్నినెలలుగా చంద్రబాబు, లోకేశ్‌ల పర్యటనల్లో దాడులు జరుగుతున్నాయని.. ఇద్దరికీ సరైన భద్రత కల్పించడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కేంద్రానికి టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కనకమేడల ర‌వీంద్ర కుమార్ లేఖ రాశారు. ఈ లేఖపై.. కేంద్ర హోంశాఖ స్పందించింది.