వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!

Viveka

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్‌ రెడ్డి బెయిల్ దాఖలకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. శుక్రవారం సుప్రీం కోర్టు లో పరిణామం జరిగింది. అయితే ట్రయిల్ కోర్టులో బెయిల్ దాఖలుకు ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఏదైనా సందర్భంలో సెప్టెంబర్‌ వరకు కానీ విచారణ ప్రారంభం కాకపోతే బెయిల్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గతంలో జస్టిస్‌ ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల శివశంకర్ రెడ్డి సుప్రీంలో సవాలు చేశారు. శుక్రవారం జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఇదిలా ఉంటే.. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. ఆగస్టు-14న కోర్టుకు హాజరుకావాలని సమన్లలో కోర్టు పేర్కొంది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్‌ రెడ్డిపై సీబీఐ ఛార్జీషీట్‌ వేసింది.

కాగా.. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న వివేకా హత్య కేసులో ఒక్కసారిగా సీబీఐ కోర్టు నుంచి పిలుపురావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన్ను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. అయితే.. ఇప్పటి వరకూ సీబీఐ విచారణకు మాత్రమే పిలిచింది.. ఇప్పుడు కోర్టు సమన్లు ఇవ్వడంతో ఆగస్టు-14న ఏం జరుగుతుందో అని వైసీపీ వర్గాల్లో గుబులు మొదలైందట.