‘మార్గ‌ద‌ర్శి’ విష‌యంలో వైసీపీ అనుకున్న‌ది జ‌ర‌గ‌లేదా?!

ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావుకు చెందిన మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్‌, చిట్‌ఫండ్ కంపెనీ విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అనుకున్న విధంగా ఏమీ జ‌ర‌గ‌లేదా? ఈ విష‌యంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెన‌క్కి ప‌డుతున్నాయని పెద్ద‌లు బాధ‌ప‌డుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నాయకులు. తాజాగా సుప్రీంకోర్టులోనూ.. స‌ర్కారు త‌ల‌పెట్టిన కార్యం నెర‌వేర‌లేదు.

మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ కేసుల‌ను ఏపీ ప‌రిధిలోని హైకోర్టులో విచారించేలా ఆదేశించాల‌ని కోరుతూ.. ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. అయితే.. దీనిని సుప్రీంకోర్టు తాజాగా తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి కేసుల బదిలీకి అత్యున్న‌త న్యాయ‌స్థానం నిరాకరించింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

“న్యాయ పరిధి విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలి. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్ల‌కు కాలం చెల్లాయి. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌పై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం. మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత‌ తెలంగాణ హైకోర్టుకే ఉంటుంది” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే.. ఈ విచార‌ణ‌, స‌ద‌రు ఆదేశాల‌పై విస్తృత ధ‌ర్మాస‌నానికి వైసీపీ ప్ర‌భుత్వం రిఫ‌ర్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.