కాంగ్రెస్ అగ్రనాయకుడు, గాంధీల వారసుడు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గుజరాత్‌లోని స్థానిక సూరత్ కోర్టు ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాదు.. రెండేళ్లపాటు.. ఆయనను విచారించేందుకు కూడా అనుమతులు తీసుకోవాలని(వేరే కేసుల్లో) కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు సంతోషం వెల్లివిరుస్తోంది.
ఏం జరిగింది?
2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన రాహుల్‌గాంధీ.. ప్రధాన నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ.. “దేశంలోని ఘరానా దొంగలందరి ఇంటి పేర్లూ.. మోడీ అనే ఉంటుంది చిత్రంగా!” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తదుపరి సంవత్సరం.. గుజరాత్‌లో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కేసును సుదీర్ఘకాలం విచారించిన కోర్టు.. ఈ ఏడాది మార్చిలో రాహుల్‌ను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
అయితే.. ఆవెంటనే రాహుల్ బెయిల్ పిటిషన్ వేసుకోవడం.. ఆయనకు బెయిల్ కూడా రావడం తెలిసిందే. ఇదిలావుంటే .. పార్లమెంటు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం. రెండేళ్ల జైలు శిక్ష పడిన వారిని అనర్హులను చేయాలనే నియమంతో రాహుల్‌పైనా వేటు వేసింది. దీంతో కొడైనాడ్(కేరళ) నుంచి గెలిచిన రాహుల్.. సస్పెండ్ అయ్యారు. ఇక, ఈ కేసును ఆయన సుప్రీంలో సవాల్ చేసి.. శిక్షపై స్టే కోరారు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
మరి తర్వాత.. ఏం జరుగుతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పుడు పార్లమెంటులో తన గళం వినిపించాలనేది రాహుల్ ఉద్దేశం. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆయనకు ఉన్న శిక్ష అడ్డంకి పాక్షికంగా తొలిగింది. మరి స్పీకర్ ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తారో లేదో చూడాలి.