కేసీయార్ను కలుపుకునేదెవరు ?

మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్ ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. అదేమిటంటే తాను ఎన్డీయే, ఇండియా కూటమి రెండింటికీ సమాన దూరమన్నారు. తాను ఏ కూటమిలోను చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పారు. అంతాబాగానే ఉంది కానీ అసలు కేసీయార్ ను ఎవరు చేర్చుకుంటున్నారు ? పై రెండు కూటములు కేసీయార్ ను ఎప్పుడో దూరం పెట్టేశాయి. పై రెండు కూటములు తనను దూరంగా పెట్టిన విషయాన్ని కేసీయార్ ఉల్టాగా చెప్పుకుంటున్నారు. తాము ఎవరివైపు ఉండమని మిత్రులతోనే ఉంటానని ప్రకటించారు.

నిజానికి కేసీయార్ కు ఇపుడు మిత్రులంటు ఎవరు లేరు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని అనుకుంటున్న కేసీయార్ ఏదో ఒక కూటమిలో చేరాల్సిందే. అయితే కేసీయార్ క్రెడిబులిటి దెబ్బతినేయటంతో పై రెండు కూటముల్లో ఏది కూడా తమతో కలుపుకోవటానికి ఇష్టపడటంలేదు. అందుకనే సమావేశాలకు కూడా పిలవకుండా దూరం పెట్టేస్తున్నది. కేసీయార్ కు మిత్రపక్షంగా ఒక్కపార్టీ కూడా లేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడుతున్న కేసీయార్ వీలైనన్ని పార్టీలను మిత్రులుగా చేసుకోవాలి. కానీ తన వైఖరి వల్ల అందరినీ దూరం చేసుకున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, కేజ్రీవాల్, స్టాలిన్ ను కలిసినా ఎవరూ పట్టించుకోలేదు.

ఏరోజు ఎలా వ్యవహరిస్తారు ? ఏ పార్టీతో ఎన్ని రోజులు మిత్రపక్షంగా ఉంటారో ఎవరు చెప్పలేరు. ఒక పార్టీతో మిత్రపక్షంగా ఉంటూనే ఆపోజిట్ పార్టీలతో భేటీలైన సందర్భాలున్నాయి. అందుకనే జాతీయ పార్టీలేవీ కేసీయార్ ను నమ్మడం లేదు. రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ను పోటీ చేయించాలని బాగా పట్టుదలగా ఉన్నారు. అందుకు తగ్గట్లే మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో బాగా దృష్టిపెట్టారు. అందుకు వీలుగా పదేపదే పర్యటిస్తున్నారు. పార్టీని విస్తరించాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ అందుకు తగ్గట్లుగా బలమైన వేదికను ఏర్పాటుచేసుకోవాలి.

ఆ వేదికే కేసీయార్ కు లేదు. మహారాష్ట్రలోని కొందరు నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నంత మాత్రాన ఆ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించగలదా ? ఎన్నికల్లో గెలిచిన సీట్లే పార్టీ రాతను నిర్ణయిస్తాయి. తెలంగాణాలో తొందరలో జరగబోయే ఎన్నికల్లోను కేసీఆర్ గెలవటం కష్టమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. కాబట్టి ముందు తెలంగాణాలో పునాదులను పటిష్టం చేసుకోవటంపై దృష్టిపెట్టాలి. ఆ తర్వాతే ఎన్ని ఆటలాడినా చెల్లుతుంది.