వైసీపీ నేతలు మరి తెలిసి చేస్తున్నారో, తెలియకచేస్తున్నారో గాని… పదేపదే కోర్టులను ఇబ్బంది పెట్టేలా, కోర్టులను ఆక్షేపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 70 సార్లు కోర్టుల్లో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా కేవలం 14 నెలల సమయంలోనే ఇన్ని దెబ్బలు తగిలాయి. ఇక ఇటీవల వరుసగా రంగుల విషయంలో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వార్నింగ్ లు కూడా వచ్చాయి.
రమేష్ కుమార్ కేసు కారణంగా కోర్టులకు వైసీపీ సర్కారుకు మధ్య దూరం పెరగ్గా, వైసీపీ నేతలకు కోర్టులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఫోన్ ట్యాపింగ్ (తప్పుడు ప్రచారం అని ప్రభుత్వం కొట్టిపారేసింది) వ్యవహారం వైరల్ అయిన నేపథ్యంలో, సుప్రీంకోర్టులో వైసీపీ నేతలు కోర్టులపై చేసిన వ్యాఖ్యలు విచారణలో ఉన్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వాటికి ఆజ్యం పోసే వ్యాఖ్యలు చేశారు.
పేదలకు పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం ఏ మాత్రం సరైన పని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఇళ్ల స్థలాల అంశంలో కోర్టులు త్వరతిగతిన ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టులకే ఆయన సలహా ఇచ్చారు. అంతటితో ఆగలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేయవు, పేదలకు ఇళ్లు ఇస్తాం అని మేనిఫెస్టోలో పెట్టాం… అందుకే ఇస్తున్నాం అని వ్యాఖ్యానించారు.
కోర్టులే వైసీపీ హామీలు ఆపుతున్నాయన్న అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. ఉన్నవాళ్లు భూ కబ్జాలు చేస్తారు, పేదలకు గవర్నమెంటే స్థలాలు ఇవ్వాలి కదా అని అన్నారు. ఇప్పటికే 3 తేదీలు మార్చాల్సివచ్చినందుకు చింతించారు మంత్రి గారు.
పనిలోపనిగా చంద్రబాబుపై కొన్ని విసుర్లు వేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు. చంద్రబాబు పేదలకు ఇళ్లను అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వేరు. అమరావతి రాజధాని భూములను పేదలకు పంచొద్దని హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.