టార్గెట్‌.. సీమ చంద్ర‌బాబు స్కెచ్ ఇదే..!

టార్గెట్ రాయ‌ల‌సీమ.. నినాదంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు బ‌ల‌మైన వ్యూహాన్ని రెడీ చేసుకున్నార‌నే మాట‌ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా.. పార్టీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి ఉత్త‌రాంధ్ర‌, కోస్తాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన చంద్ర‌బాబు.. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు కీల‌క‌మైన సీమ‌పైత‌న వ్యూహాల‌ను రెడీ చేసుకున్నార‌ని అంటున్నారు.

ఆగ‌స్టు 1 నుంచి నాలుగు రోజుల పాటు చంద్ర‌బాబు సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇక్క‌డ కీల‌క‌మైన స‌మ‌స్య‌గా ఉన్న సాగునీటి అంశాన్ని ప్ర‌ధానంగా లేవ‌నెత్తాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆయా ప్రాజెక్టుల‌కు సంబంధించిన స‌మాచారం రెడీ చేసుకున్నారు. రైతుల‌తోనూ మ‌మేకం అవుతున్నారు. ఉమ్మ‌డి అనంత‌పురం, క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల్లో ప్ర‌ధానంగా సాగ‌నున్న చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో రైతులు భారీ సంఖ్య‌లో పాల్గొనేలా చూస్తున్నారు.

వైసీపీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను అస్త్రాలుగా చేసుకుని చంద్ర‌బాబు ఇక్క‌డ రైతుల ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు సీమ ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తామ‌ని వైసీపీ హామీ ఇచ్చింది. అదేస‌మ‌యంలో క‌డ‌ప వంటి ప్రాంతా ల‌ను కూడా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పింది. అయితే.. ఈ హామీలు అలానే ఉండిపోయాయి. ఇప్పుడు వాటినే టార్గెట్ చేసుకుని చంద్ర‌బాబు పొలిటిక‌ల్ యాత్ర‌కు రెడీ అవుతున్నారు.

నిజానికి పులివెందుల‌కు అందుతున్న నీరు.. గ‌తంలో చంద్ర‌బాబు నిర్మించిన ప‌ట్టిసీమ ప్రాజెక్టుతోనే సాధ్య‌మైంద‌ని అంటారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు కూడా ప‌దే ప‌దే చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు విష‌యాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించ‌నున్నారు. అదేస‌మ‌యంలో పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల‌ను కూడా త‌గ్గించేందుకు.. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌నున్నారు. మొత్తంగా.. సీమ ప‌ర్య‌ట‌నపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.